Tirumala Laddu Dispute in Telugu: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని, తిరుమల క్షేత్రంలో అపవిత్రం జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఒట్టిదేనా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు ది ప్రింట్‌తో చెప్పిన మాటలే ఇందుకు సాక్ష్యం. మరి ఇంత దారుణంగా మత రాజకీయాలు అవసరమా..అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం సృష్టించాయి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ వివాదం రాజుకుంటోంది. దేశమంతా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. మత రాజకీయాలు మొదలైపోయాయి. జూలైలో శాంపిల్ సేకరించి చేసిన పరీక్ష రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు కలిసిందంటూ తేలింది. ఈ నివేదికను జూలైలో బహిర్గతం చేయకుండా మూడు నెలలు ఆలస్యంగా సెప్టెంబర్‌లో బయటపెట్టడం మొదటి అనుమానం. ఇక కల్తీ జరిగిందంటూ చెబుతున్న ట్యాంకర్ల నెయ్యి వాడారా లేదా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. 


ఎందుకంటే జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తయారైన లడ్డూ తిన్న భక్తులకు ఇది మహా పాపం కిందే లెక్క. అందుకే హిందూవులంతా ఆందోళనలో పడ్డారు. హిందూవుల ఆందోళనలో అర్ధముంది. నిజంగానే ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడి ఉంటే నిస్సందేహంగా అది నేరమే. ఒకవేళ వాడి ఉండకపోతే హిందూవుల మనోభావాలతో ఆడుకున్నట్టే కదా. మత రాజకీయాలు చేసినట్టే కదా. మరి ఈ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా లేదా అనేది చెప్పాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు. ఆయనేమన్నారో తెలుసుకుందాం.


ఆ నెయ్యి వాడలేదు, వెనక్కి పంపించేశాం- టీటీడీ ఈవో శ్యామలరావు


ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్ ది ప్రింట్ ఇదే ప్రశ్నను టీటీడీ ఈవో శ్యామలరావును అడగగా ఆయన ఆ నెయ్యి వాడలేదని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత జూన్ 12న టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ఫిష్ ఆయిల్, లార్డ్ అంటే పంది కొవ్వు, బీఫ్ కొవ్వు ఇతర వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని చెబుతున్న నెయ్యి జూలైలో సరఫరా అయింది. తమిళనాడు ఏఆర్ డెయిరీకు చెందిన 10 ట్యాంకర్లలో 4 ట్యాంకర్ల నెయ్యి నాణ్యత లోపించిందనే కారణంతో టీటీడీ వెనక్కి పంపించింది. అంటే ఆసలు ఆ నాలుగు ట్యాంకర్లు తిరుమల లడ్డూ తయారీకు వెళ్లలేదు. ఈ నాలుగు ట్యాంకర్ల శాంపిల్స్‌లో రెండు జూలై 6న, మరో రెండింటిని జూలై 12న సేకరించి నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌కు పంపించారు. అదే NDDB CALF ల్యాబ్. ఈ నివేదిక జూలైలోనే వచ్చింది. అందులో జంతువుల కొవ్వు కలిసి ఉండవచ్చని ఉంది. 


అయితే ఈ నెయ్యిని లడ్డూ తయారీలో నూటికి నూరు శాతం వాడలేదని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. ఆ నాలుగు ట్యాంకర్లను పక్కనబెట్టి NDDB CALF రిపోర్ట్‌లో కల్తీ అని వచ్చిన తరువాత వాటిని తిరిగి ఏఆర్ డెయిరీకు పంపించేశామని టీటీడీ ఈవో తెలిపారు. మొత్తం ఐదు సంస్థల నుంచి నెయ్యి సరఫరా అయిందని అందులో ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన శాంపిల్‌లోనే కల్తీ జరిగినట్టు తేలిందని శ్యామలరావు తెలిపారు. 


చంద్రబాబు ఆరోపణలకు ఆధారం NDDB CALF నివేదికేనా


కానీ ఇదంతా తెలిసి కూడా సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మత రాజకీయాలకు బీజం వేసేందుకేననే విమర్శలు వస్తున్నాయి. తిరస్కరించిన నెయ్యికి సంబంధించిన రిపోర్ట్ ఆధారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మండిపడ్డారు. ఇదే విషయంపై మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు సైతం స్పందించారు. నిజంగా చంద్రబాబు NDDB CALF రిపోర్ట్ ఆధారంగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటే కచ్చితంగా అవి నిరాధారమైనవే. అసమంజసమైనవే. ఈ నివేదిక కాకుండా ఇంకా ఇతర ఆధారాలు లేకపోతే చంద్రబాబుకు ఇది బూమరాంగ్ కావచ్చని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.


Also read: Bengaluru Horror: బెంగళూరులో హర్రర్, 25 ఏళ్ల యువతి ముక్కలు ముక్కలుగా ఫ్రిజ్‌లో , అసలేం జరిగింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.