ఈ నెల 27న తిరుమల, శ్రీశైలం ఆలయాలు మూసివేత
చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27న తిరుమల శ్రీవారి ఆలయాన్ని, శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారులు తెలిపారు.
చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27న తిరుమల శ్రీవారి ఆలయాన్ని, శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారులు తెలిపారు. గ్రహణం పట్టే సమయానికి 6 గంటల ముందుగానే ఆలయద్వారాలు మూసివేయడం ఆనవాయితీ.
శ్రీవారి ఆలయం: చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27న సాయంత్రం5 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున4.15 వరకు శ్రీవారి ఆలయం మూసేయనున్నారు. ఆ రోజు రాత్రి 11.54 గంటల నుంచి 28న తెల్లవారుజామున 3.49 గంటల వరకు చంద్రగ్రహణం ఘడియలు ఉంటాయి. గ్రహణం అనంతరం వేకువజామున 4.15కు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం చేస్తారు. తర్వాత తోమాల, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. 28న ఉదయం 7 నుంచి సర్వదర్శ నం ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం కారణంగా 27న కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది.
శ్రీశైలం ఆలయం: గ్రహణం రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళ వాయిద్యాలు, 4కు సుప్రభాత సేవ, 5కు మంగళ హారతులు, 5.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు సర్వదర్శనం, నిత్య అభిషేకాలు ఉంటాయన్నారు దేవస్థానం అధికారులు. మధ్యాహ్నం 2 నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు.