Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల వెనుక పెద్ద వ్యూహమే ఉందా, తెరవెనుక ఏం జరుగుతోంది
Pawan Kalyan Hindutwa: తిరుపతి లడ్డూ వివాదం కాస్తా ఇప్పుడు మతపరంగా మారిపోయింది. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం కడుతున్నానంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు, చేస్తున్న దీక్షలు రాష్ట్రంలో జరగనున్న పరిణామాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. మొత్తం వ్యవహారం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Pawan Kalyan Hindutwa: తిరుపతి లడ్డూ వివాదం సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ముఖచిత్రం మారిపోనుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల అలవోకగా చేస్తున్నవి కావన్పిస్తోంది. పక్కా వ్యూహం ప్రకారం హిందూత్వ ముఖచిత్రంగా మారేందుకు చేస్తున్నట్టు అన్పిస్తోంది. అదే జరిగితే ఏపీలో రాజకీయ ముఖ చిత్రమే మారిపోవచ్చు.
తిరుపతి లడ్డూలో వ్యవహారంలో మైలేజ్ పొందేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రశ్నార్ధకంలో పడింది. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పోరాటగళం ఎంచుకోవడమే కాకుండా చేస్తున్న వ్యాఖ్యలు, చేసే దీక్షలు అతడిని హిందూత్వంవైపుకు తీసుకెళ్తున్నాయి. తిరుపతి తరువాత రెండవ పెద్ద పుణ్యక్షేత్రమైన విజయవాడ అమ్మవారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సినీ పరిశ్రమలో తనకు కావల్సిన మిత్రులు తిరుమల లడ్డూ వ్యవహారంపై చేసే వ్యాఖ్యల్ని సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు. తమిళ హీరో కార్తి, మిత్రుడు ప్రకాష్ రాజ్‌పై అందుకే ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందూత్వం ఫస్ట్ అంటున్నారు పవన్ కళ్యాణ్. సనాతనం జోలికి వస్తే సహించేది లేదంటున్నారు. అక్కడితో ఆగలేదు. కేంద్ర స్థాయిలో సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేసి హైందవ ధర్మ పరిరక్షణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా హిందూత్వంపై భక్తితో చేస్తున్నారా అంటే కానే కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెరవెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు.
రాజకీయాల్లో దక్షిణాదికి ఉత్తరాదికి చాలా తేడా ఉంటుంది. దక్షిణాదిలో ఎప్పుడూ స్థానిక అంశాలు, అభివృద్ధి, కులాలు, ప్రాంతీయ పార్టీలే ప్రాతిపదికగా ఉంటాయి. మతం ఆధారిత రాజకీయాలు పెద్దగా ఉండవు. దేశవ్యాప్తంగా హిందూత్వకు కేరాఫ్ అని చెప్పుకునే బీజేపీ తెలంగాణలో ఇటీవల ఆ దిశగా పురోగతి సాధించింది. తమిళనాడులో అన్నామలై నేతృత్వంలో చేయాలని చూసినా ఫలితం దక్కలేదు. ఇప్పుడా రాష్ట్రంలో మరో సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లో రావడంతో అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పునాది వేసేందుకు బీజేపీ ఎప్పట్నించో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు బీజేపీకు ఆప్తుడుగా కూటమి ఏర్పాటులో కీలక భూమిక వహించిన పవన్ కళ్యాణ్ ఆ లోటు పూరించవచ్చని తెలుస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పవన్ వెనుక బీజేపీ ఉందనేది జాతీయ స్థాయిలో విన్పిస్తున్న మాట.
అందుకే తిరుపతి లడ్డూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అవుతోంది. హిందూవుల పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో ఈ అంశాన్ని వదులుకోదల్చుకోలేదు. పవన్‌కు ఉన్న సినిమాభిమానులు, జనసైనికుల సహకారంతో హిందూత్వను బలంగా తీసుకెళ్లేందుకు ప్లానింగ్ జరుగుతోందంటున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌కు హిందూత్వవాదుల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది.
తెలుగుదేశానికి చెక్ పెట్టనున్నారా
ఎప్పుడైతే తిరుపతి లడ్డూ విషయంలో జనసేనాని పోరాటం ఉధృతం చేశారో తెలుగుదేశం పార్టీ ఆత్మ రక్షణలో పడిపోయినట్టు కన్పిస్తోంది. ఎందుకంటే నిన్నటి నుంచి తిరుపతి లడ్డూ విషయంలో పవన్ మాటలే వైరల్ అవుతున్నాయి. పవన్ దీక్షలే హైలైట్ అవుతున్నాయి. రానున్న కాలంలో తెలుగుదేశానికి చెక్ పెట్టేందుకు పవన్ రూపంలో ఈ కొత్త ఉద్యమం ఉపయోగపడుతుందనేది బలంగా విన్పిస్తున్న మాట. అంతేకాదు..రానున్న సమీప భవిష్యత్తులో బీజేపీ నేతృత్వ బాధ్యతలు పవన్ కళ్యాణ్ తీసుకున్నా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు లేదా నేతల్ని చేర్చుకోవడం కావచ్చు జోరుగా సాగుతోంది. ఇదంతా రానున్న కాలంలో టీడీపీకే దెబ్బ కొట్టవచ్చనేది ఓ వాదన.
సరే..ఎవరి వాదన ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ దీక్షా రాజకీయాలు సక్సెస్ అయితే కచ్చితంగా ఇది ఏపీలో కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీయనుంది. బీజేపీని పవన్ కళ్యాణ్ వాడుకుంటారా లేక పవన్ కళ్యాణే బీజేపీని వాడుకుంటారా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.