తిరుపతిలో శ్రీవారి నగలు ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయని.. అయితే నగలను గుడి దాటించారన్న రమణ దీక్షితుల మాటలు వింటుంటే వాటిని ఆయన ఎప్పుడైనా తీసుకెళ్లాడేమో? అన్న అనుమానం తలెత్తుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పలువురు పాలకమండలి సభ్యులు శ్రీవారి ఆభరణాల గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలకమండలి సభ్యుడు పెద్దిరెడ్డి మాట్లాడుతూ, తాము కొన్ని ఆభరణాలను అనుమతితో పరిశీలించామని.. దీక్షితులు చేస్తున్న ఆరోపణల్లో సత్యమేమీ లేదని అన్నారు. ఈ ఆరోపణల రీత్యా స్వామి వారి ఆభరణాలను బహిరంగ ప్రదర్శనకు పెట్టకూడదని.. అలా చేయడం తప్పని ఆయన తెలిపారు. 


ఈ రోజు మరో పాలకమండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి మాట్లాడుతూ, రిజిస్టర్ ప్రకారం ఆభరణాలు అన్నీ లాకరులోనే ఉన్నాయని తెలిపారు. ఇక ఆభరణాల ప్రదర్శనకు సంబంధించి కూడా పలువురు మాట్లాడారు. శ్రీవారి ఆభరణాలను బహిరంగంగా ప్రదర్శించడానికి ఆగమ శాస్త్రాలు ఒప్పుకోవని ఆగమ సలహాదారుడు సుందరవదన భట్టాచార్యులు తెలిపారు.