రెండేళ్లలో లక్ష విద్యుత్ వాహనాలు: సీఎం చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించి, యువతకు విస్తృత ఉపాధి కల్పించేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2018ని ఎలక్ట్రిక్ వాహన సంవత్సరంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాలుష్యరహితం చేయడంతో పాటు యువతకు విసృతంగా ఉపాధి కల్పించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. హీరో మోటారు వాహనాల పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి పరంగా ప్రథమ స్థానంలో ఉందని, ప్రపంచంలోని అన్ని అత్యుత్తమ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.
'రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించి, యువతకు విస్తృత ఉపాధి కల్పించేలా 2018ని ఎలక్ట్రిక్ వాహన సంవత్సరంగా ప్రకటిస్తున్నాం. రానున్న రెండేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశ పెట్టాలన్న లక్ష్యంలో భాగంగా ముందుగా పది వేల వాహనాలను ప్రభుత్వమే వినియోగించేలా చర్యలు చేపట్టాం' అని సీఎం చెప్పారు.
"ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ మార్కెటింగ్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఈ క్లస్టర్‌ను త్వరలోనే దేశంలోనే అత్యుత్తమ ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌ని కాలుష్య రహితం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం" అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్ బాగా పని చేస్తుందని, తమ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాల సృష్టి, ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచేందుకు సేవా రంగంలో పారిశ్రామీకరణకు, ఆర్ధికాభివృద్ధిపై దృష్టి పెట్టాలని యోచిస్తోందని చెప్పారు. "గత నాలుగు సంవత్సరాలలో, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన ఆంధ్రప్రదేశ్, రెండంకెల వృద్ధిగా 10.5 శాతాన్ని సాధించింది. ఈ కారణంచేత మేము ఇప్పుడు ఉద్యోగాల సృష్టి, ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచేందుకు సేవా రంగంలో పారిశ్రామీకరణకు, ఆర్ధికాభివృద్ధిపై దృష్టి సారించాము" అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతిల్లో ముందుగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. రెండేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. ముందుగా పది వేల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగిస్తామని, ఏపీఎస్‌ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇ-రిక్షాలను నడిపేందుకు వీలుగా త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో యూఎస్, చైనా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియాలు అగ్రగామిగా ఉన్నాయని, వాటిని అధిగమించేలా ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై తిరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
విద్యుత్ బస్సు ప్రారంభం
కాగా, 'గో గ్రీన్-బ్రీత్ క్లీన్’ నినాదంతో ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ప్రవేశపెట్టనున్న పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకు నాందిగా బ్యాటరీతో పనిచేసే బస్సు, కారును సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ బస్సు త్వరలో విజయవాడ-అమరావతి మధ్య పరుగులు పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనానికి చార్జింగ్ చేసేందుకు అయ్యే సమయాన్ని తగ్గించే టెక్నాలజీని అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి సాధిస్తుందని ప్రధానంగా సౌరవిద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు.