ఎన్టీఆర్‌కు ఏపీ సర్కార్ మరోసారి వెన్నుపోటు పొడిచింది : ప్రధాని నరేంద్ర మోదీ
ఏపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ''నందమూరి తారకరామా రావు గారు తెలుగు జాతికి నిజమైన గర్వకారణంగా నిలిచారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తెలుగు వారిని అవమానించిన కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ ఎప్పుడూ క్షమించలేదు. ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్‌తో జత కట్టడం ద్వారా ప్రస్తుతం ఏపీలో అధికారంలో వున్న వాళ్లు మరోసారి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించే క్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఏఎన్ఐ వెల్లడించింది. నేడు ఏపీలోని అనంతపురం, కడప, కర్నూలు, నర్సారావుపేట, తిరుపతి ప్రాంతాలకు చెందిన బూత్ స్థాయి నేతలు, కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాసేపు సంభాషించారు.