Tamanna Simhadri: పవన్ కల్యాణ్‌కు షాక్.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తమన్నా
Tamanna Simhadri Contest In Pithapuram: ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలని కసితో ఉన్న పవన్ కల్యాణ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనకు పోటీగా ఒకరు బరిలోకి దిగడం కలకలం రేపింది.
Tamanna Simhadri: గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా చట్టసభలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. పదేళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్నా ఇంతవరకు ఒక్క పదవి పొందలేదు. ఈ నేపథ్యంలో తన సామాజికవర్గం అత్యధికంగా ఉండే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. తన పోటీ కోసం స్థానిక టీడీపీ నాయకుడిని పక్కకు జరిపి మరి పవన్ పోటీ చేస్తున్నారు. అన్ని చక్కదిద్దుకుంటున్న క్రమంలో అనూహ్యంగా పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ తగిలింది. పవన్‌కు పోటీగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) తరఫున తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు. తమన్నా ఎవరో కాదు ట్రాన్స్‌జెండర్. ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.
Also Read: Janmat Polls: ఏపీ ఎన్నికలపై మరో సర్వే.. ఈసారి ప్రజలు పట్టం కట్టేది వారికే..
పిఠాపురం నుంచి తమన్నా పోటీ చేస్తారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల ప్రచార ఇన్‌చార్జిగా ఆకుల జయ కల్యాణిని నియమించారు. పెద్దగా పోటీ లేకుండా చూసుకుంటున్న పవన్ కల్యాణ్‌కు తమన్నా పోటీ చేయడం కొంత ఇబ్బంది కలిగించే విషయమే. తమన్నా పోటీ ప్రభావం పిఠాపురం నియోజకవర్గంలో కొంత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మంగళగిరిలో నారా లోకేశ్‌పై తమన్నా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే భయం పవన్ కల్యాణ్‌కు పట్టుకుంది.
తమన్నా సింహాద్రి నేపథ్యం
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ హైదరాబాద్‌లో స్థిరపడిన తమన్నా ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఇంటర్వ్యూల ద్వారా ఫేమస్ అయిన తమన్నా బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ పోరాటం ద్వారా తమ వర్గానికి హక్కులు, న్యాయం కల్పించేలా ఉద్యమం చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్లకు చట్టసభలో అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో తమన్నా తరచూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తాజాగా పిఠాపురం నుంచి ఆమె పోటీ చేస్తుండడం గమనార్హం. గతంలో జనసేన పార్టీలో పనిచేసిన తమన్నా సింహాద్రిని పవన్ కల్యాణ్ నేరుగా ఏనాడూ కలవలేదు. గత ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేయడానికి జనసేన అంగీకరించలేదు. దీంతో జనసేన నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా మంగళగిరి నుంచి పోటీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook