కొందరు యాత్రికులు ఓ అడవికి విహారయాత్రకని వస్తారు.. ఈ క్రమంలో దారి మరిచిపోతారు. ఎన్నో అష్టకష్టాలు పడి దారి కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు.. అచ్చం ఏదో హాలీవుడ్ సిన్మా కథ లాగే ఉంది కదా ఈ కథ. ఇలాంటి ఘటనే విశాఖపట్నంలోని సింహాచలం కొండపై జరిగింది.  సీతమ్మధార ప్రాంతం నుండి ఆదివారం ఉదయం ట్రెక్కింగ్‌కు బయలుదేరిన ఆరుగురు విద్యార్థులు దారి తెలియక అడవిలో తప్పిపోవడం నిజంగానే స్థానికుల్లో ఉత్కంఠను రేపింది. సుమారు 20 మంది ఎన్‌.ఎస్‌.ఎస్‌ కార్యకర్తలుగా పనిచేస్తున్న విద్యార్థులు ట్రెక్కింగ్‌కని బయలుదేరగా.. అందులో ఆరుగురు సరదాగా అటవీ ప్రాంతంలో వేరే మార్గానికి ఎవరికీ చెప్పకుండా వెళ్లడంతో తప్పిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో వారి దగ్గరున్న ఫోన్లు కూడా పనిచేయలేదు. తమతో ట్రెక్కింగ్‌కని బయలుదేరిన ఆరుగురు విద్యార్థులు తప్పిపోయారని తెలియడంతో.. కాలేజీ యాజమాన్యం సహాయంతో స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజుకు సమాచారం అందించి సహాయాన్ని కోరారు మిగతా విద్యార్థులు. ఆయన ఈ విషయాన్ని సీపీ యోగానంద్‌, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌లకు తెలపడంతో.. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డీసీపీ ఫకీరప్ప ఆధ్వర్యంలో దాదాపు 60 మంది పోలీసులతో ఒక కూంబింగ్ టీమ్ తయారుచేసి... వారికి వైర్ లెస్ సెట్లు అందించి... అటవీ ప్రాంతాన్ని మొత్తం గాలించడానికి పంపారు.


అలాగే ఈ క్రమంలో స్థానిక నావికదళ అధికారుల సహాయం కూడా కోరారు. వారి సహాయంతో హెలికాప్టర్ ద్వారా కూడా విద్యార్థులను కనిపెట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నేవీ పైలట్లు సీడీఆర్ బి విజయ్ కుమార్, లెఫ్టినెంట్ నిలభ్‌లు విద్యార్థులను కనిపెట్టారు. ఎట్టకేలకు విద్యార్థులు కొండపై చిక్కుకుపోయారని నిర్థారించుకున్న పోలీసులు, ఇతర సహాయక సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి వారిని కాపాడారు.