చంద్రబాబుకు షాక్.. జనసేనలో చేరిన చదలవాడ కృష్ణమూర్తి
చంద్రబాబుకు షాక్.. జనసేనలోకి చదలవాడ కృష్ణమూర్తి
టీడీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీలో చేరారు. గురువారం శ్రీకాకుళం పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేన విధానాలు, పవన్ సేవా దృక్పథం నచ్చే పార్టీలో చేరినట్టు ఆయన తెలిపారు. పవన్ ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తానని.. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన సందర్భంగా జనసేన తరుఫున స్వచ్చంద సంస్థలకు రూ.25లక్షలు విరాళం అందజేస్తున్నట్టు ప్రకటించారు. అటు చదలవాడ చేరికతో తిరుపతిలో జనసేన బలోపేతమవుతుందని పార్టీ భావిస్తోంది.
జనసేనలోకి చదలవాడ చేరిక టీడీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. నిజానికి టీడీపీ నుంచి తిరుపతి బరిలో దిగాలని భావించినా.. ఆ విషయంలో అధినేత చంద్రబాబు నుంచి భరోసా లభించకపోవడంతోనే చదలవాడ పార్టీ మారారని స్థానిక మీడియాలో వస్తున్న వార్తల సారాంశం. టీడీపీ నుంచి బయటికి వస్తున్న క్రమంలో ఆయన వైసీపీతోనూ టచ్‌లో ఉన్నారని, అయితే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా భూమన కరుణాకర్ రెడ్డి ఉండటంతో టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో జనసేనలో చేరినట్లు సమాచారం.
ఇటీవలే జనసేన పార్టీ అధినేతను చదలవాడ తిరుపతిలో కలిశారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని చదలవాడ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై పవన్ కల్యాణ్‌తో చదలవాడ సుదీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. కాగా జనసేన పార్టీలో చదలవాడ చేరికతో తిరుపతి నగర రాజకీయలు రసవత్తరంగా మారనున్నాయి.