తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్లీ లడ్డూల జారీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై పలు పత్రికలు వార్తలు రాశాయి.  ఇటీవలే తిరుపతిలో భక్తుల తాకిడిని పరిగణనలోకి తీసుకొని.. దేవస్థానం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యంగా గరుడసేవ లాంటి కార్యక్రమాలు ఉన్న రోజున ఎక్కవస్థాయిలో భక్తులు వస్తుంటారు. కావున.. తొక్కిసలాట లాంటివి జరగకుండా చూడాలని ఒకవైపు సెక్యూరిటీకి ఆదేశాలు ఇస్తూనే.. మరోవైపు జనాభాను పరిగణనలోకి తీసుకొని టోకెన్ల స్కానింగ్ అవసరం లేకుండానే లడ్డూలు అందివ్వాలని దేవస్థానం తెలిపింది. ఇంకేముంది.. ఇదే మంచి తరుణమని భావించి.. పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు భారీగా లడ్డూలు తరలించాలని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ లడ్డూలు ఏ బ్లాక్ మార్కెట్‌లో హల్చల్ చేస్తాయో ఆ శ్రీనివాసునికే ఎరుక..! ప్రస్తుతం స్టేట్  బ్యాంకు ఆఫ్ ఇండియాతో పాటు ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఆధ్వర్యంలో నడిచే లడ్డూల కౌంటర్లు ఉన్నాయి. ఈ కౌంటర్లలోనే కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా టోకెన్ల స్కానింగ్ అవసరం లేదని చెప్పడంతో దాదాపు పదివేలకు పైగానే  లడ్డూలను బ్లాక్ మార్కెట్‌లో అమ్మేందుకు తరలించారని అంటున్నారు. 


రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. లడ్డూలను పక్కదారి పట్టించడానికి కొందరు ఉద్యోగులు నకిలీ టోకెన్లు కూడా ముద్రించారు. అయితే వారిని అప్పటి ఈవో వేగంగానే గుర్తించి.. సస్పెండ్ చేశారు. అలాగే గతంలో తిరుపతి డోనర్ సెల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి దాదాపు 60 వేల లడ్డూలను కాజేసినట్లు సమాచారం. అయితే అప్పట్లో టిటిడి విజిలెన్స్ కమిటీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా తెలిపింది. మరి తాజా ఘటన విషయమై కూడా టిటిడి పాలకవర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.