రేపటి నుంచి ఎల్లుండి ఉదయం వరకు తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేత!
వేంకటేశ్వర స్వామి ఆలయం మూసివేతపై టీటీడీ బోర్డు అధికారిక ప్రకటన
ఈ నెల 27వ తేదీ శుక్రవారం రాత్రి చంద్రగ్రహణం ఏర్పడనున్న కారణంగా ఆగమశాస్త్రాలను అనుసరించి ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆ మరుసటి రోజైన శనివారం తెల్లవారు జామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి 11.54కు ప్రారంభం కానున్న చంద్రగ్రహణం శనివారం ఉదయం 3.49 వరకు ఉంటుంది. గ్రహణం ఏర్పడిన ప్రతీసారి ఆ సమయానికి 6 గంటలు ముందు నుంచే ఆలయం తలుపులు మూసివేసే ఆనవాయితీ ఉండటంతో ఎప్పటిలాగే సంప్రదాయం ప్రకారం ఈసారి కూడా శుక్రవారం సాయంత్రం నుంచే దర్శనాన్ని నిలిపేసి ఆలయాన్ని మూసేస్తున్నట్టు శ్రీనివాస రాజు తెలిపారు.
ఆలయం మూసివేతతోపాటే యధావిధిగా నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవలనూ రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. అంతేకాకుండా ఆ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ సైతం నిలిపివేస్తున్న టీటీడీ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ముందస్తుగా సాయంత్రం అదే రోజు 3 నుంచి 5 వరకు టీటీడీ అన్నప్రసాదాల విభాగం ఆధ్వర్యంలో 20వేల పులిహోర, టమాటా రైస్ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్టు తాజా ప్రకటనలో పేర్కొంది.
శనివారం ఉదయం 4.15కు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచిన తర్వాత గ్రహణం అనంతరం చేసే శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఆ తర్వాత తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చనసేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు యధావిధిగా భక్తులకు వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కలగనున్నట్టు టీటీడీ బోర్డు తెలిపింది.