కేంద్ర కేబినెట్‌తో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధపడిన తెలుగు దేశం పార్టీ, కేంద్ర కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు టీడీపీ ఎంపీల చేత రాజీనామా చేయడానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు  కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు తమ రాజీనామా లేఖలు సిద్ధం చేసుకున్నారు. అయితే, తమ రాజీనామా లేఖలు సమర్పించడానికన్నా ముందుగా ఈ ఇద్దరు టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత ప్రధాని మోదీ వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు సమాచారం. ప్రధానితో భేటీలో తమ రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించి, ఆ తర్వాత మర్యాదపూర్వకంగానే రాజీనామా లేఖలు సమర్పించేందుకు నిర్ణయించుకున్నారు టీడీపీ ఎంపీలు. 


ప్రధాని మోదీతో భేటీ తర్వాత టీడీపీ ఎంపీలు అధికారికంగా తమ రాజీనామా లేఖలు సమర్పించనుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అని రాజకీయ పార్టీలు ప్రస్తుత పరిణామాలని ఆసక్తితో పరిశీలిస్తున్నాయి.