Venkateshwara Swamy Temple in Jammu and Kashmir: జమ్మూలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, నార్త్ ఇండియా టీటీడీ ఎల్ఏసి ప్రెసిడెంట్ ప్రశాంతి రెడ్డి పరిశీలించారు. జూన్ 8న జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తామని వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూ ప్రభుత్వం ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కోసం 62 ఎకరాల స్థలం కేటాయించిందని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరపున టిటిడి నిధులు కేటాయించి 30 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ ఆలయంలో జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ, 12 గంటలకు భక్తులకు ఉచిత దర్శనం సేవ ప్రారంభం అవుతుందని చెప్పారు. 


శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే జమ్మూ - కాట్రా మార్గంలో ఈ ఆలయం ఉందని, భక్తులు బాలాజీ ఆశీస్సులు కూడా అందుకోవచ్చని అన్నారు. ఈ ఆలయం నగరానికి దూరంగా ఉందని, ఇక్కడ 24 గంటల పాటు శాశ్వత భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని జమ్మూ ప్రభుత్వాన్ని కోరామని సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. 


ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తున్నామని, ఇటీవల చెన్నై, విశాఖపట్నం భువనేశ్వర్ అమరావతి తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అదే విధంగా అహ్మదాబాద్, చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌లోనూ స్వామివారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడతామని వైవి సుబ్బారెడ్డి స్పష్టంచేశారు.


జమ్మూలో టిటిడి చేపడుతున్న ఈ ఆలయ నిర్మాణంతో ఇక్కడి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తుల రద్దీని తగ్గించవచ్చని టిటిడి భావిస్తోంది. దేశం నలుమూలలా ఆలయాల నిర్మాణంతో ఎక్కడికక్కడే భక్తులకు ఆ వేంకటేశ్వరుడి దర్శనాన్ని కల్పించడంతో పాటు కలియుగ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయొచ్చనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇలా దేశంలో అక్కడక్కడా వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే.