రాజమండ్రి: ఆరోగ్యకరమైన జీవనశైలి, భారతీయ ఆహారపు అలవాట్లను, చక్కని వైద్యసేవలను ప్రోత్సహించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్య భారతాన్ని నిర్మించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. అందరికీ అందుబాటులో చౌకధరల్లో వైద్యాన్ని అందించడాన్ని ఓ లక్ష్యంగా తీసుకోవాలని ఆయన వైద్య రంగంలో ఉన్న నిపుణులకు పిలుపునిచ్చారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. గురువారం రాజమహేంద్రవరంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన డెల్టా ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న వినూత్న, సృజనాత్మకమైన పద్ధతులను భారతీయ వైద్యులు అవలంబిచాలని అన్నారు. గ్రామీణ భారతంలో వైద్యసేవలు మెరుగుపర్చాల్సిన అవసరాన్ని విస్మరించరాదని వెంకయ్య నాయుడు సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పూర్వీకులు చెప్పిన మంచి మాటలను ఆచరించకపోవడం వల్లే ఇటీవల అందరికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని.. అప్పట్లో మన పూర్వీకుల పద్ధతులు, వారి చక్కటి అలవాట్లు, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం వల్లే మానసికంగా, శారీరకంగా వారు ఆరోగ్యంగా దృఢంగా ఉండేవారని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : రాజ్యసభలో 10 భాషల్లో మాట్లాడిన వెంకయ్య నాయుడు


నేటి యువతకు ఉపరాష్ట్రపతి సూచనలు..
ఈ సందర్భంగా నేటి జీవనవిధానం గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం అనే విషయాన్ని యువత అర్థం చేసుకోవాలని అన్నారు. ''ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్యపోకడల ప్రభావంతో జంక్ ఫుడ్‌పై ఆసక్తి పెంచుకోవడం కూడా నేటి తరం వారు అనారోగ్యం బారిన పడటానికి ఓ ముఖ్య కారణం. అందుకే భారతీయ సంప్రదాయ వంటకాలను ఆస్వాదించడం ద్వారానే మన ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవచ్చని వెంకయ్య నాయుడు సూచించారు. 


మాతృభాషపై మరోసారి ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి మాతృభాషలోనే భోదన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యులు మాతృభాషలో మాట్లాడటాన్ని అలవాటు చేసుకుంటే వైద్యం కోసం వచ్చే వారి సమస్యలను సరిగ్గా అర్థం చేసుకుని.. సరైన వైద్యం అందించేందుకు వీలుంటుందని చెప్పే క్రమంలో సమాజం కూడా మాతృభాషను కాపాడటాన్ని బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఆంగ్ల భాష మాధ్యమాలు ఉండాల్సిన అవసరం ఉందని చెబుతూనే.. ప్రాథమిక స్థాయి విద్యాబోధన మాతృభాషలో జరిగేలా ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. మాతృభాషలో విద్యాబోధనపై రాజకీయాలు చేయడం సరికాదని.. తెలుగు భాషను కాపాడుకోకపోతే తెలుగు సంస్కృతి, సంప్రదాయాల అస్తిత్వానికే ప్రమాదమనే విషయాన్ని అందరూ గుర్తించాలని హితవు పలికారు. ఇటీవల ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు మరోసారి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..