AP New DGP News: అమరావతి: రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలకమైన అంశాలపై దృష్టి సారిస్తోంది. ముందు ముందు ఎన్నికల ఏడాది కావడంతో శాంతి భద్రతలు అత్యంత ప్రధానంగా మారాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొందని ప్రతిపక్ష, రాజకీయ పార్టీలు విమర్శలు సంధిస్తున్న తరుణంలో పోలీసు శాఖను పటిష్టం చేయడంతోపాటు వచ్చే ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ సమర్ధవంతంగా జరగాలి. అందుకు పోలీసుశాఖను పూర్తి స్ధాయిలో సమాయత్తం చేయాల్సి ఉంటుంది. సరిగ్గా ఎన్నికల ముందు పోలీసు శాఖపై ప్రతిపక్షాల ఆరోపణలకు అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఇప్పుడే అంతా సెట్‌రైట్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో డీజీపీ వ్యవహారం తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి ఇన్‌ఛార్జిగా మాత్రమే కొనసాగుతున్నందున ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో డీజీపీగా పనిచేసే ఆఫీసర్ నియామకం అత్యంత కీలకంగా మారినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడిదే అంశం అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు పోలీసు శాఖలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడున్న కసిరెడ్డినే కొనసాగించేలా కేంద్రం ఆమోదం లభించేలా లాంఛనాలు పూర్తి చేస్తారా లేక కొత్త డీజీపీ నియామకం చేపడతారా అన్న చర్చ కొనసాగుతోంది. అయితే ఒకవేళ వేరే ఐపీఎస్ ఆఫీసర్‌ని పూర్తిస్థాయి డీజీపీగా ఎంచుకోవాల్సి వస్తే.. రాజేంద్రనాధ్‌ రెడ్డి కన్నా సీనియర్లు రేస్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎవరిని కోరుకుంటుందోనన్న సందేహంపై ఐపీఎస్‌ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డిని తప్పిస్తే రేస్‌లో ఉన్నట్లు చెబుతున్న ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ పి సీతారామాంజనేయులుకు రాష్ట్ర పోలీసు ఫోర్స్‌ చీఫ్‌గా అవకాశం దక్కనుందని విస్తృత ప్రచారం జరుగుతోంది.
 
ఇదిలావుంటే డీజీపీ నియామకానికి సంబంధించి యుపీఎస్‌సీ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న రాజేంద్రనాధ్‌ రెడ్డి నియామకానికి ఆమోదం తెలియచేయాలన్నా.. ఇంకెవరినైనా నియమించాలన్నా యుపీఎస్‌సీ సూచించిన వారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకోవచ్చు. తాజా పరిస్ధితుల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కసిరెడ్డితోపాటు మరో ఐదు పేర్లతో కలిపి డీజీపీ నియామకం కోసం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.


16 నెలలుగా ఇన్‌ఛార్జి హోదాలోనే.. రాజేంద్రనాధ్ రెడ్డి
ఏసీబి డీజీగా నియమితులైన కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి గత 16 నెలలుగా ఇన్‌ఛార్జి డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర డీజీపీ విధులతోపాటు ఏసిబి చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వం కసిరెడ్డిని డీజీపీగా నియమించింది. అప్పటి వరకు ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్న ఆయన్ను అక్కడి నుంచి రిలీవ్‌ చేసి ఇన్‌ఛార్జి డీజీగా నియమించిన దాదాపు వారం తర్వాత ఏసిబి డీజీగా ఫుల్‌ ఛార్జి ఇస్తూ జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి యుపీఎస్‌సీ ద్వారా నియామకం జరగాలి. నియమితులైన అధికారి కనీసం రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది.


అయితే రాజేంద్రనాథ్‌ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఆయన్ను డీజీపీగా నియమించినప్పటికీ కేంద్రానికి ప్యానెల్‌ పంపలేదు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌ఛార్జిగా ఎక్కువ కాలం కొనసాగడం కుదరనందున ఆయన పేరు సహా డీజీ ర్యాంకు అధికారుల పేర్లతో జాబితా పంపాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో రెండుసార్లు లేఖలు రాసింది. ప్రభుత్వం నుంచి స్పందన లేనందున ఈ ఏడాది జనవరిలో డీఓపీటీ నుంచి మరో లేఖ వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరిగింది. ఈనేపధ్యంలో రానున్న ఎన్నికల దృష్ట్యా, ప్రస్తుత పరిస్ధితుల రీత్యా డీజీపీ నియామకంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. తాజాగా 1992 బ్యాచ్‌కు చెందిన కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి, హరీష్‌ కుమార్‌ గుప్తా, పి. సీతారామాంజనేయులుతోపాటు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులైన ఏఆర్‌. అనురాధ (1987), ద్వారకా తిరుమల రావు (1989), మహమ్మద్‌ హసన్‌ రజా (1991) ఈ ఐదుగురి పేర్లతో ప్యానల్‌ పంపినట్లు ఐపీఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


ఎవరికి ఛాన్స్‌..?
కాగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానల్‌లోని పేర్లను పరిశీలించిన మీదట యుపీఎస్‌సీ ముగ్గురిని ఎంపిక చేసి తిరిగి పంపుతుంది. వారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకోవాల్సి ఉంటుంది. ఇన్‌ఛార్జిగా ఉన్న రాజేంద్రనాధ్‌ రెడ్డి విషయంలో ఇది జరుగకుంటే ఇబ్మందులు తలెత్తే అవకాశం లేకపోలేదని ఒకవేళ ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వం ప్రాధాన్యత, సామాజిక, రాజకీయ, ఇతర సమీకరణ నేపధ్యంలో మరో ఆలోచన చేస్తే కనుక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పి సీతారామాంజనేయులు డీజీపీగా నియామకం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 


1992 బ్యాచ్‌కు చెందిన పి సీతారామాంజనేయులుకు 2026 ఆగష్టు వరకు పదవీ కాలం ఉంది. ఇక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన 1989 బ్యాచ్‌కు చెందిన ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమల రావుకు ఛాన్స్‌ వచ్చే అవకాశం లేకపోలేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ఎపి ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డిజిపి పివి సునీల్ కుమార్. పేరును కూడా వైఎస్ జగన్ పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం పంపిన ప్యానల్‌లో తిరుమలరావు పేరు యుపీఎస్‌సీ తిరిగి పంపే ముగ్గురిలోనూ ఉంటుందని ఆ ముగ్గురిలో తిరుమల రావును ఎంపిక చేసే విషయంలో ఇక రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని అయితే ఆయన అన్ని విధాల అర్హత కలిగిన అధికారిగా చర్చ జరుగుతోంది. ఈయనకు 2025 వరకు పదవీ కాలం ఉంది. తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు- ప్రచారం జరుగుతోంది. 


1992 బ్యాచ్‌కే చెందిన మరో సీనియర్‌ అధికారి హరీష్‌ కుమార్‌ గుప్తాకు 2025 వరకు పదవీ కాలం ఉంది. ఈయన ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన హాసన్‌ రేజా పదవీ కాలం జూలైతో ముగియనుంది. అదేవిధంగా 1987 బ్యాచ్‌కు చెందిన అనురాధ కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే రిటైర్ అవనున్నారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆమె వైపు మొగ్గు చూపితే పదవీ కాలం పొడిగించే అవకాశం ఉంటుంది.


డీజీ క్యాడర్‌‌లో ఉన్న అధికారులు..
స్టేట్‌ కేడర్‌లోని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల్లో డీజీ హోదా కలిగిన సీనియర్ల జాబితాలో మరి కొందరు అధికారులు కూడా ఉన్నారు. ఏబీ వెంకటేశ్వర రావు ప్రస్తుతం ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇక 1990 బ్యాచ్‌కు చెందిన అంజనా సిన్హా , అంజనీ కుమార్‌ ప్రస్తుతం తెలంగాణాలో కొనసాగుతున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ వెయిటింగ్‌లో ఉన్నారు. నళిన్‌ ప్రభాత్‌ (1992), ఫైర్‌ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌, అమిత్‌ గార్గ్‌ తదితరులు ఉన్నారు. కాగా పీఎస్సార్‌కు అవకాశం వస్తే ఇంటిలిజెన్స్‌ డీజీగా పీవీ సునీల్‌ కుమార్‌ను నియమించే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.