విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రజల ఆదరణను, అభిమానాన్ని పొంది.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్‌ది అన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు పాతికేళ్లు కూడా నిండని వయసులో స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్‌ను కలిశారని ఓ వార్త ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. ఎన్టీఆర్ గొప్ప చిత్రకారుడని.. ఆయన అద్భుతమైన చిత్రాలు గీసేవారని.. అలా ఆయన గీసిన ఓ గొప్ప నేతాజీ చిత్రాన్ని స్వయంగా ఎన్టీఆరే బోస్‌కి బహుమతిగా అందించారని ఓ వార్త ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సంఘటనకు ఊతమిచ్చే ఫోటోలు ఉన్నాయని కూడా సమాచారం. ఇంతకీ ఈ విషయం ఎప్పుడు బహిర్గతమైందంటే.. ఎన్టీఆర్‌తో ఎన్నో సినిమాల్లో నటించిన నటుడు చలపతిరావు ఓ ప్రముఖ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ గతంలో ఈ విషయాన్ని తెలిపారు. సుభాష్ చంద్రబోస్ విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయనకు కానుకగా ఇచ్చాడని ఆ తర్వాత పలు పత్రికలు వార్తలను కూడా ప్రచురించాయి.


అయితే ఈ విషయంలో నిజం ఎంతవరకు ఉందో తెలియదని పలువురు అంటున్నారు. స్వయానా నందమూరి వారసులే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తే బాగుంటుందని కూడా కొందరి అభిమానుల అభిప్రాయం. చిత్రమేంటంటే..  స్వయాన ఎన్టీఆరే "మేజర్ చంద్రకాంత్" సినిమాలో నేతాజీ పాత్రను పోషించడం. ఆ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలియంది కాదు. పాతికేళ్లు కూడా నిండని వయసులోనే ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి జాతీయ స్థాయిలో నాటకాలు వేసేవారు. అదే సమయంలో ఆయనకు పలువురు జాతీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని పలువురు అంటున్నారు.