కేంద్రం ఎందుకు భయపడుతోంది: చంద్రబాబు
అవిశ్వాస తీర్మానం అంటే కేంద్రం ఎందుకు భయపడుతుంది అని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
అవిశ్వాస తీర్మానం అంటే కేంద్రం ఎందుకు భయపడుతుంది అని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. న్యాయం చేయమని అడిగితే.. బెదిరించే పద్ధతులను కేంద్రం అవలంబిస్తుందని ఆయన అన్నారు. హామీలను నెరవేర్చాలని అడిగినంత మాత్రాన.. శత్రువుల్లా చూడడం తగదన్నారు. నిన్నే ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంతో పాటు టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. తాము పెట్టే తీర్మానానికి చాలా పార్టీలు మద్దతిస్తున్నాయని.. ఏపీలోని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.
స్పెషల్ స్టేటస్ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్పితే.. రాస్తారోకోలు, ధర్నాలు చేసినంత మాత్రాన అది పరిష్కారం కాదని.. పైగా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం తగ్గుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న తరుణంలో... అంతర్జాతీయ దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా కలిసికట్టుగా మద్దతు తెలిపేందుకు రావాలని ఆయన అన్నారు.
భారతీయ జనతా పార్టీ భిన్న వైఖరులు అవలంబిస్తుందని.. బతిమాలినా పట్టించుకోలేదని.. మంత్రులు రాజీనామా చేసినా మిన్నకుండిపోయిందని.. ఎన్డీయే నుంచి వైదొలిగినా ఇంకా మీనమేషాలు లెక్కపెడుతుందని.. అలాంటప్పుడు ఏ పార్టీ అయినా అవిశ్వాసం ప్రకటించక ఏం చేస్తుందని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర సమస్య జాతీయ సమస్యగా మారిందని.. ఈ సమస్యను పరిష్కరించాలంటే.. ఎంపీలు కలిసికట్టుగా ఉండడం ఎంతో అవసరమని అని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ రక్షణ నిధులను ఏపీ అడిగిందని అరుణ్ జైట్లీ చెప్పిన మాటలు తమను ఎంతో కలచివేశాయని.. అందుకే ఆవేశంతో నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.