హాస్టల్ విద్యార్థులకు రూ.20 వేలు, పిల్లల్ని బడికి పంపితే రూ.15 వేలు: వైఎస్ జగన్
హాస్టల్ విద్యార్థులకు రూ.20 వేలు, పిల్లల్ని బడికి పంపితే రూ.15 వేలు: వైఎస్ జగన్
ఏలూరు: నిరుపేద విద్యార్థులకు ఖరీదైన విద్య అందించిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకాన్ని చంద్రబాబు నీరుగార్చారని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైఎస్సార్సీపీ నిర్వహించిన బీసీ గర్జన సభలో పాల్గొన్న జగన్ సభకు హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు ముష్టి వేసినట్టు రూ.30 వేలు అందిస్తున్నారని, ఆ మొత్తం సరిపోని విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఈ సందర్భంగా జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఉన్నత చదువులు చదవాలన్న ఆశయం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది అని చెప్పిన జగన్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రతి విద్యార్థికి హాస్టల్ మెస్ చార్జీల కింద ఏడాదికి రూ.20 వేలు, పిల్లలను బడికి పంపే తల్లులకు రూ.15 వేలు ఇస్తామని మరోసారి పునరుద్ఘాటించారు. అంతేకాకుండా మీ పిల్లల ఉన్నత చదువులకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది అని జగన్ స్పష్టంచేశారు.