జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయలపై మాట్లాడటం, వినడం మన ఖర్మ అని అన్నారు. మంగళవారం జగన్‌ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో మీడియాతో మాట్లాడారు. ‘అసెంబ్లీ నుంచి జగన్‌ పారిపోయారు’ అన్న పవన్‌ విమర్శలను ఓ విలేకరి గుర్తుచేయగా ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విలువలు లేని పవన్ మాట్లాడితే సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. పవన్‌కు విలువలెక్కడున్నాయి?ఆయనకు నలుగురు భార్యలు ఉన్నారు. కొత్త కారు మార్చినట్లు భార్యలను మారుస్తారని ఆరోపించారు. నాలుగేళ్లు, ఐదేళ్లకొకసారి భార్యను మారుస్తాడంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పవన్‌లా బహుభార్యత్వం వేరెవరికైనా ఉంటే అతడిని జైలులో వేసేవారన్నారు. ఇలాంటోళ్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీలుడినని మాట్లాడడం లాంటివి అంటే బాధేస్తుందని వ్యాఖ్యానించారు.


‘మన కర్మ ఏంటంటే.. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నా మనం వినాల్సి వస్తోంది. నిజంగా, ఇది మన కర్మే. నాలుగేళ్లు ఇదే పెద్దమనిషి టీడీపీ, బీజేపీతో కలిసి కాపురం చేసి.. ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకొచ్చి తాను పతివ్రతను అని చెబుతున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఏపీని పొడిచేసి.. నాలుగేళ్లు గమ్మున ఉన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకొచ్చి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. తప్పు చేసింది తాను కాదంటే తాను కాదని చెబుతున్నారు ' అని జగన్ మండిపడ్డారు. కాగా, పవన్‌పై జగన్ ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి.


రాష్ట్ర బంద్ విజయవంతం


వైసీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని జగన్ తెలిపారు. వైసీపీ నాయకులను అరెస్టు చేయించడం విచారకరమని అన్నారు. బంద్‌కు సహకరించని పార్టీల నిర్ణయాన్ని వారివిజ్ఞతకే విడిచిపెడుతున్నానని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా అతి దారుణంగా ఏపీ బంద్‌ను చంద్రబాబు సర్కారు అణచివేయాలని చూసిందని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.