Narreddy Sunitha Reddy: ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్‌రెడ్డికి మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతున్నారు. ఆమె ఎవరో కాదు జగన్ బాబాయ్‌ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమితులైన షర్మిల.. అన్న జగన్‌పై రాజకీయ పోరాటానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా.. ఆమెతో సునీతారెడ్డి జత కట్టబోతున్నారు. సునీతారెడ్డి త్వరలో కాంగ్రెస్‌ తీర్థం తీసుకోబోతున్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పని చేశారు. వివేకా హత్య తర్వాత ఆయన కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లో లేరు. అయితే తన తండ్రి హత్య కేసులో సునీతా రెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. ఈ కేసులో సీబీఐ విచారణకు అన్ని విధాలా సహకరిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. కోర్టు కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలంటూ ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీతారెడ్డి అడుగుపెట్టబోతుండటం సంచలనం మారుతోంది.


రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీలో సునీతారెడ్డి చేరతారంటూ కొంత కాలంగా ప్రచారం జరిగింది. అయితే ఏపీలో తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల్లో సునీతా రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన తండ్రి వివేకా హత్య దర్యాప్తు విషయంలో తనకు మొదటి నుంచి అండగా ఉన్న సోదరి వైఎస్‌ షర్మిలకు కాంగ్రెస్‌ పగ్గాలు దక్కడంతో సంతోషంగా ఉన్న సునీతారెడ్డి.. తాను కూడా అదే పార్టీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. తద్వారా సోదరి అండతో పాటు తనకు పార్టీ సపోర్టు కూడా లభిస్తుందని సునీతారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.


సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి.. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి కానీ కడప ఎంపీ స్థానం నుంచి కానీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందుల నుంచి జగన్ ప్రాతినిధ్యం వహిస్తుండగా... కడప ఎంపీగా అవినాశ్‌రెడ్డి కొనసాగుతున్నారు. తన తండ్రి హత్యకు అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డే కారణమంటూ సునీతారెడ్డి ఇంతకాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. మరోవైపు షర్మిల కూడా కడప ఎంపీ స్థానం నుంచి కానీ.. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి కానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దాంతో ఒక వేళ కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తే.. సునీత పులివెందుల నుంచి బరిలో దిగడం ఖాయమంటున్నారు. ఇదే జరిగితే.. అధికార వైసీపీకి గట్టి పోటీ ఎదురైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద ఈ అన్నాచెల్లెళ్ల పోరు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.


Also Read EPFO Nominee Rules: పీఎఫ్ నామినీగా కొడుకు, కుమార్తెను చేర్చవచ్చా, ఎవరికి అవకాశం లేదు


Also Read EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. గడువు పెంచుతూ EPFO కీలక నిర్ణయం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter