అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు 'నేతన్న నేస్తం' పథకాన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్.. అక్కడే ఈ పథకాన్ని ప్రారంభించారు. నేతన్న నేస్తం పథకంలో భాగంగా చేనేత మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి ఏపీ సర్కార్ నుంచి ఏడాదికి రూ.24వేలు ఆర్థిక సహాయంగా అందనున్నాయి. పట్టువస్త్రాలకు పెట్టింది పేరైన ధర్మవరం ప్రాంతంలో చేనేత వృత్తిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనాధారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చేనేత కార్మికుల మగ్గాల నిర్వహణకు, వారి వృత్తికి చేయుతను అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాంతాన్నే వేదికగా ఎంచుకున్నారు.