2019 ఎన్నికల్లో పోటీపై పార్టీ వైఖరేంటో ప్రకటించిన వైఎస్సార్సీపీ
టీడీపీ, బీజేపీలు ఆంధ్రప్రదేశ్‌కి నష్టాన్నే తీసుకొచ్చాయి : వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బొత్స.. అనంతరం పార్టీ భవిష్యత్ ప్రణాళికలు, అధికార పార్టీ చేస్తోన్న రాజకీయాలపై మాట్లాడారు. అధికారంలోకొచ్చిన గత నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీలు ఆంధ్రప్రదేశ్‌కి నష్టాన్నే తీసుకొచ్చాయి. పైగా కొత్తగా వైఎస్సార్‌సీపీకి బీజేపీతో సంబంధాలున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు అని బోత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, వాళ్లకి, వారికి సంబంధించిన వారికే పార్టీలో, ప్రభుత్వంలో అవకాశాలు కల్పిస్తున్న టీడీపీ మరోవైపు వైఎస్సార్సీపీనే బీజేపీతో స్నేహం చేస్తోందని అనడం ఎంతమేరకు సబబు అని ఈ సందర్భంగా బొత్స అధికార పార్టీని నిలదీశారు.
అధికారంలోకి వచ్చిందే ఐదేళ్లపాటు దోచుకోవడానికన్న చందంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అందుకే ఆయన గారి దోపిడీని పుస్తక రూపంలోకి తీసుకొచ్చి, దేశంలో అన్ని పార్టీల నేతలకు చంద్రబాబు అవినీతిని తెలిసేలా చేస్తాం. ఓవైపు బీజేపీతో, ఆ పార్టీ నేతలతో లాలూచీ రాజకీయాలు చేస్తోన్న టీడీపీ... మరోవైపు వారితో ఏ సంబంధం లేని తమ పార్టీపై బురదజల్లే కుట్ర చేస్తోందని బొత్స మండిపడ్డారు. ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో వైఎస్సార్సీపీకి ఉన్నంత చిత్తశుద్ధి టీడీపీకి లేదు అని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు.