వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం
వైసీపీ ఎంపీల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు.
న్యూఢిల్లీ: వైసీపీ ఎంపీల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. నేటి సాయంత్రం లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశముంది. మేకపాటి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు.
బుధవారం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో వైసీపీ లోక్‌సభ సభ్యులు సమావేశమయ్యారు. వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని వారు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యులు విజయ్‌సాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూడా స్పీకర్ వద్దకు వెళ్లారు.
స్పీకర్ తో సమావేశం అనంతరం ఎంపీలు మాట్లాడుతూ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పునర్ నిర్ధారణ కోసం తమను మరొకసారి రాజీనామా లేఖలు ఇవ్వాలని కోరారని చెప్పారు. తాము రెండవసారి రాజీనామా లేఖలను రాసి ఇచ్చామని, వెంటనే స్పీకర్ వాటిని ఆమోదించారని వారు చెప్పారు. తమ పార్టీ తరఫున గెలిచి, పార్టీ మారిన ముగ్గురు ఎంపీలపై (నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి, కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక, అరకు ఎంపీ కొత్తపల్లి గీత) అనర్హత వేటు వేయాలని కోరామని చెప్పారు. ఉప ఎన్నికలు రాని రాజీనామాలు ఎందుకని విమర్శించే బదులు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలను దేశ ప్రజలకు తెలియజేయాలని కోరారు.
తమ చిత్తశుద్ధిపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సర్టిఫికెట్లు అవసరం లేదని.. తాము చిత్తశుద్ధితో రాజీనామాలు చేసినట్లు ప్రజలు గుర్తించారని వారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా జగన్ వల్లే సాధ్యమవుతుందని వారు చెప్పారు.