EPF vs VPF : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్.. ఈ రెండూ కూడా వేతన జీవులు తమ పదవీ విరమణ సమయానికి అవసరం అయ్యే కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయి. పైగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ అందించినంత అధిక వడ్డీ మరే ఇతర బ్యాంక్ సేవింగ్స్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా అందించవు. అందుకే వృద్ధాప్యంలో రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడిపేయాలని ప్లాన్ చేసుకునే వారికి ఈ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ , వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎంతో సహాయపడతాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ ఈ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌కి, వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్‌కి మధ్య తేడా ఏంటి ? అసలు వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటి అనే సందేహాలు జనం బుర్రను తొలిచేస్తుంటాయి. అలాంటి వారి సందేహాలు తీర్చే కథనమే ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటి ?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్.. దీనినే సింపుల్‌గా షార్ట్‌కట్‌లో ఈపీఎఫ్ అని కూడా అంటుంటాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఉద్యోగుల భవిష్య నిధి అని అర్థం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ నిధిని నిర్వహిస్తుంటుంది. వేతన జీవులకు పదవీ విరమణ చేసిన తర్వాత వారి ఆర్థిక అవసరాల కోసం ఈ నిధి ఉపయోగపడుతుంది. 


ఒక వ్యక్తి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో మొత్తం మూడు కేటగిరిలు ఉంటాయి. అందులో ఒకటి ఎంప్లాయి కేటగిరి కాగా మరొకటి ఎంప్లాయర్ కేటగిరి. ఇక మిగిలిన మూడోది ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కేటగిరి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఏర్పాటు చేయడం కోసం ఏ నెలకు ఆ నెల ఉద్యోగి బేసిక్ పే శాలరీలోంచి 12 శాతంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్‌ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో మీరు పని చేసే సంస్థలు మీ తరపున జమ చేస్తాయి. దీనికి సమానమైన మొత్తాన్ని మీరు పని చేసే సంస్థ యజమాన్యం కూడా మీ భవిష్య నిధి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కంపెనీ యాజమాన్యం చేసే 12 శాతం కంట్రిబ్యూషన్‌లోంచి 8.33 శాతం ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కింద జమ చేస్తారు. మిగిలిన 3.67 శాతం ఎంప్లాయర్ కేటగిరి ఫండ్ కింద ఇపిఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. 


వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటంటే ?
వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఒక రకంగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌కి కొనసాగింపు అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌ని ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన తరువాత కూడా ఒక వ్యక్తికి ఆర్థికంగా మరింత పొదుపు చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉంటే.. వారు తమ ఇష్టపూర్తిగా, స్వచ్ఛందంగా వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్‌ని ఎంపిక చేసుకుంటారు. వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ కింద ఉద్యోగి కేవలం 12 శాతం కాంట్రిబ్యూషన్‌ మాత్రమే చేయాల్సి ఉంటుంది అని ఎలాంటి పరిమితులు ఉండవు. డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు వారి బేసిక్ పే వేతనం మొత్తాన్ని కూడా వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ కింద జమ చేసుకోవచ్చు. కాకపోతే ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ తరహాలో వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో మీరు పని చేసే సంస్థ యజమాని వైపు నుండి ఎలాంటి డిపాజిట్స్ ఉండవు. ఇది కేవలం ఒక ఉద్యోగి తన ఇష్టపూర్తిగా మాత్రమే చేసుకునే అదనపు పొదుపు అని చెప్పుకోవచ్చు.


వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ vs ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ .. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి ?
2021 బడ్జెట్ తర్వాతి నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ కింద ఒక ఉద్యోగి చేసే కంట్రిబ్యూషన్ మొత్తం రూ. 2.5 లక్షలు మించినట్టయితే.. ఆ అదనపు మొత్తంపై వచ్చే వడ్డీపై ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇదే నిబంధన వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ కింద చేసే కంట్రిబ్యూషన్ కి కూడా వర్తిస్తుంది. ఈ విషయంలో రెండింటి మధ్య ఎలాంటి తేడా లేదు. 


తప్పనిసరిగా చేసే కంట్రిబ్యూషన్ vs స్వచ్ఛందంగా చేసే కంట్రిబ్యూషన్ : ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఖాతా అనేది ప్రతీ ఉద్యోగికి ఒక తప్పనిసరి పొదుపు కాగా వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది వారి ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. పదవీ విరమణ అనంతరం అధిక ఖర్చులు ఉంటాయి అని భావించే వారు అధిక కార్పస్‌ ఫండ్ కోసం వాల్యుంటరీ ప్రావిడెంట్ ఫండ్ ని ఎంచుకుంటారు.