GST Collection July 2023: రికార్డుస్థాయిలో జూలై నెల జీఎస్టీ వసూళ్లు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?
GST Collection in July 2023: జూలై నెలలో రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. జీఎస్టీ వసూళ్లు ఐదోసారి రూ.1.6 లక్షల కోట్ల మార్కును దాటింది. జూలైలో రూ.1,65,105 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
GST Collection in July 2023: జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,65,105 కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వస్తు సేవల పన్ను ప్రారంభమైన తర్వాత జీఎస్టీ వసూళ్లు ఐదోసారి రూ.1.6 లక్షల కోట్ల మార్కును దాటినట్లు తెలిపింది. గతేడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్‌టీ వసూళ్ల కంటే ఈ ఏడాది జూలైలో వచ్చిన వసూళ్లు 11 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు దేశీయ లావాదేవీల ఆదాయంలో గతేడాదితో పోలిస్తే 15 శాతం పెరుగుదల ఉంది. జీఎస్టీ వసూళ్లకు సంబంధించి ట్విట్టర్ ద్వారా వివరాలను పంచుకుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ.
జూలై నెలలో వసూలైన రూ.1.65 లక్షల కోట్ల స్థూల జీఎస్టీలో రూ.29,773 కోట్లు సీజీఎస్టీ కాగా.. ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.37,623 కోట్లుగా ఉన్నాయి. వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.41,239 కోట్లతో కలిపి రూ.85,930 కోట్లు ఐజీఎస్టీ, వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.840 కోట్లతో కలిపి సెస్ నుంచి రూ.11,779 కోట్లు వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ఈ నెలలో ప్రభుత్వం అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు వచ్చాయి.
ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.39,785 కోట్లు, ఎస్‌జీస్టీకి రూ.33,188 కోట్లు ప్రభుత్వం సెటిల్ చేసిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెగ్యులర్ సెటిల్‌మెంట్ తర్వాత జూలైలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.69,558 కోట్లు, ఎస్‌జీఎస్టీకి రూ.70,811 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. గత నెలలో జీఎస్టీ ఆదాయం రూ.1,61,487 కోట్లుగా ఉంది. ఇది ఏడాదికి 12 శాతం పెరిగింది. అయితే ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు కాగా.. మేలో రూ. 1,57,090 కోట్ల వసూళ్లు గణనీయంగా పెరిగాయి.
ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు మరింత పెరుగుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, దీపావళి, భాయ్ దూజ్ మొదలైన పెద్ద పండుగల తరుణంలో మార్కెట్‌లో ఎక్కువ విక్రయాలు ఉంటాయి. దీని కారణంగా రానున్న నెలల్లో జీఎస్టీ వసూళ్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే నేటి నుంచి జీఎస్టీ కింద కొత్త రూల్ కూడా అమల్లోకి తీసుకువచ్చింది. తాజా నిబంధన ప్రకారం.. రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీల B2B వ్యాపారం కోసం ఈ-ఇన్‌వాయిస్ రూపొందించడం తప్పనిసరి. గతంలో లిమిట్ రూ.10 కోట్లు ఉండగా.. రూ.5 కోట్లకు తగ్గించింది.