Money Earning Business Ideas: ఏడాదికి 40 లక్షల లాభం తెచ్చిపెట్టిన బిజినెస్
Money Earning Agriculture Ideas: వ్యవసాయంలో కొన్ని రకాల పంటల సాగు రైతులకు ఎంత లాభం అందిస్తాయో చాలామందికి తెలియదు. ముఖ్యంగా పూలు పంటల సాగు రైతులకు ఊహించనంత లాభాలను తెచ్చిపెడతాయి అంటున్నారు ఆ పంటల సాగులో భారీ లాభాలు ఆర్జిస్తున్న వారు. అందులోనూ డెకరేషన్‌కి ఉపయోగించే పువ్వులకు ఇంకా భారీగా డిమాండ్ ఉంటుంది.
Money Earning Agriculture Ideas: ఇండియాలో అలంకరణకు ఉపయోగించే పూలకి భారీ డిమాండ్ ఉంది. అందుకే దేశంలో పూల పంటలు పండించే రైతులు కూడా ఎక్కువగా అలంకారానికి ఉపయోగించే పువ్వులు పంటల వైపే మొగ్గుచూపుతున్నారు. అలా పువ్వుల పంటలు సాగు చేసే రైతులు కూడా భారీగానే సంపాదిస్తున్నారు. మహారాష్ట్రలో సింధు దుర్గ్ జిల్లా కుడాల్ తాలూకాకు చెందిన సహదేవ్ ఆత్మారామ్ అనే రైతు కూడా లిల్లీ పంటల సాగు చేస్తూ భారీ లాభాలు కళ్లచూస్తున్నాడు.
ఈ లిల్లీ పువ్వులను కేవలం ఒక్క అలంకారానికి సంబంధించిన అవసరాలకు మాత్రమే ఉపయోగించడం కాకుండా ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. గత రెండేళ్లుగా తాను తెలుపు రంగు స్పైడర్ లిల్లీ రకం పువ్వుల పంట సాగు చేస్తూ ఆర్థికంగా మంచి లాభాలు చూస్తున్నానని సహదేవ్ ఆత్మారామ్ తెలిపారు. సహదేవ్ ఈ పూల పంటలు పండించడానికంటే ముందుగా అగ్రిమ్‌లో డిప్లొమా చేశాడు.
60 రోజుల శిక్షణ
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లా అకేరి గ్రామానికి చెందిన సహదేవ్ ఆత్మారామ్ లిల్లీ పూల సాగు చేయడానికి ముందుగా సింధుదుర్గ్‌లోని కృష్ణా వ్యాలీ అడ్వాన్స్‌డ్ అగ్రికల్చరల్ ఫౌండేషన్ (కెవిఎఎఎఫ్) లో డిప్లొమా కోర్స్ పూర్తిచేశాడు. డిప్లొమా కోర్స్ చేసే సమయంలోనే సహదేవ్ ఒకసారి అలంకారమైన పూల పెంపకానికి సంబంధించిన యూనిట్‌ను సందర్శించాడు. ఇక్కడ పూల సాగు గురించి అధ్యయనం చేసే క్రమంలోనే ఓ గొప్ప విషయాన్ని తెలుసుకున్నాడు. అదేంటంటే.. లిల్లీ పువ్వులు ఏడాది పొడవునా వికసించగలవు అనే సత్యాన్ని గ్రహించాడు. అందుకే అదే పాయింట్‌ని బేస్ చేసుకుని సహదేవ్ కూడా లిల్లి పూవుల పెంపకాన్ని ప్రారంభించి అదే పూల పంటతో వ్యాపారం మొదలుపెట్టాడు.
బ్యాంకు నుంచి రూ.10 లక్షలు లోన్
లిల్లీ పూల సాగు ప్రారంభించేందుకు సహదేవ్‌కి రూ. 10 లక్షల వరకు డబ్బులు అవసరం అయ్యాయి. కానీ అంత మొత్తం తన వద్ద లేకపోవడంతో బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు రుణం తీసుకున్నాడు. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఫ్లవర్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు రుణం తీసుకున్న సహదేవ్... ఆ డబ్బులతో 'తావ్డే లిల్లీ ఫామ్' పేరుతో లిల్లీ ప్లాంటేషన్, మార్కెటింగ్ యూనిట్ బిజినెస్ మొదలుపెట్టాడు. సహదేవ్ పూర్తి పేరు సహదేవ్ ఆత్మారామ్ తావ్డే. అందుకే తన పేరుతోనే తన వ్యాపారాన్ని ప్రారంభించాడు.
2 ఎకరాల భూమిలో లిల్లీ మొక్కల పెంపకం చేపట్టాడు. తాను పండించిన పూలను స్థానిక మార్కెట్‌తో పాటు సమీపంలోని పట్టణాలకు కూడా మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టాడు. సీజన్‌ని బట్టి పూలకి ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎంతలేదన్నా.. సగటున కిలోకు రూ 80 నుంచి రూ. 140 వరకు పలుకుతుంది. సహదేవ్ ఆత్మారామ్ ఈ పూల సాగుతో ఏడాదికి రూ. 40 లక్షల వరకు సంపాదిస్తున్నాను అని చెబుతున్నాడు. సహదేవ్ గొప్పతనం ఏంటంటే.. ఇంత లాభదాయకమైన పూల సాగు చేస్తూ ఆ సీక్రెట్ ని కేవలం తనకే పరిమితం చేసుకోకుండా మరో 8 గ్రామాలకు చెందిన 150 మందికి పైగా రైతులకు కూడా పూల పెంపకం, ఉద్యానవన తోటల పెంపకంపై వారికి సలహాలు, సూచనలు చేస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారు. సహదేవ్ ఆత్మారామ్ కృషిని గుర్తించిన నాబార్డు కూడా అతడికి 36 శాతం సబ్సిడీ ఇవ్వడం విశేషం.