Cash Insurance News: చాలామంది తమ వద్ద డబ్బులు ఉంటే వాటిని రెట్టింపు చేయడం కోసం తెలివిగా పెట్టుబడి పెడుతుంటారు. ఇంకొంతమంది కేవలం సేవింగ్స్ ఎకౌంట్లో వచ్చే వడ్డీ కోసం పొదుపు ఖాతాలో డిపాజిట్ చేసి వదిలేస్తారు. ఇంకొంతమంది ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో పెడతారు. అతికొద్దిమంది మాత్రమే క్యాష్‌ని కూడా బ్యాంక్ లాకర్లో పెడుతుంటారు. ముఖ్యంగా బాగా డబ్బున్న ధనవంతులు, సేవింగ్స్ ఖాతాలో వచ్చే వడ్డీతో పని లేని శ్రీమంతులు మాత్రమే ఇలా చేస్తుంటారు అనే భావన చాలామందిలో ఉంటుంది. అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ? ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. బ్యాంక్ లాకర్లో దాచిన సొమ్ముకు ఇన్సూరెన్స్ ఉంటుందా అంటే.. ఈ ప్రశ్నకు సమాధానం ఎంతమందికి తెలుసో చెప్పండి. తెలియదా.. అయితే మనం ఇంకొంచెం ముందుకెళ్లాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా జువెలరీ లేదా ఇతర విలువైన ఆస్తి పత్రాలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ భద్రంగా ఉండటం కోసం లేదా రహస్యంగా ఉంచడం కోసం బ్యాంక్ లాకర్లలో దాచిపెడుతుంటారు. మరి అదే బ్యాంక్ లాకర్లలో నగదు దాచిపెడితే.. ఆ మొత్తానికి ఇన్సూరెన్స్ కవర్ ఉంటుందా ? బ్యాంక్ లాకర్లో ఉన్న డబ్బులను ఇన్సూరెన్స్ చేసే పాలసీలు ఉన్నాయా ? 


బజాజ్ అలియన్స్ ఇన్సూరెన్స్ విభాగానికి చెందిన సీనియర్ ఇన్సూరెన్స్ ఎక్స్‌పర్ట్ ఇదే అంశంపై స్పందిస్తూ.. సాధారణంగా మనీ ఇన్సూరెన్స్ పాలసీ కింద క్యాష్ లేదా మనీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కానీ.. ఇన్సూరెన్స్ చేసిన ప్రాంతంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లేదా చోరీ లేదా ప్రమాదవశాత్తుగా సంభవించే ఘటనల్లో మాత్రమే అది వర్తిస్తుంది అని స్పష్టంచేశారు. అయితే, బ్యాంక్ లాకర్లలో దాచిన డబ్బులకు ఇది వర్తించదని.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బ్యాంకు లాకర్లలో దాచిన డబ్బులకు మనీ ఇన్సూరెన్స్ వర్తించదు అని తెలిపారు. 


ఇదే అంశంపై మరొక ఇన్సూరెన్స్ ఎక్ట్‌పర్ట్ మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ కలిగి ఉన్న ఫ్యాక్టరీలో , దుకాణంలో లేదా ఆఫీసులో దాచిన డబ్బులకు మాత్రమే మనీ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని.. బ్యాంకు లాకర్లలో దాచిన డబ్బులకు కానీ లేదా ఏ ఇతర సొమ్ములకు ఇన్సూరెన్స్ వర్తించదు అని స్పష్టంచేశారు. 


ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్ లాకర్లలో దాచినవి వేటికి కూడా ఇన్సూరెన్స్ వర్తించదు. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు, చోరీలు, అగ్ని ప్రమాదాలు, వంటి ఏ కారణాలతో ఎలాంటి ప్రమాదం జరిగినా.. బ్యాంకులో మీ లాకర్లలో ఉన్న సొమ్ముకు బ్యాంకులు ఎప్పుడు కూడా బాధ్యత వహించవు. 


లాస్ట్ బట్ నాట్ లీస్ట్..
కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు హోమ్ ఇన్సూరెన్స్ ఇచ్చే క్రమంలో మీ బ్యాంక్ లాకర్లలో ఉన్న సొమ్ము కూడా కవర్ అవుతుంది అని చెబుతున్నప్పటికీ అందులో ఎన్నో లింక్స్ అండ్ లిటిగేషన్స్ ఉంటాయి. అందులోనూ కేవలం 20 శాతం వరకు మాత్రమే కవర్ అవుతుంది అని ఇన్సూరెన్స్ సెక్టార్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.