IRCTC Share News Today: కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయంతో ఐఆర్‌సీటీసీ షేర్లు.. ఒకే రోజు పతనమయ్యి, పుంజుకున్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో శుక్రవారం ఐఆర్‌సీటీసీ షేర్లు (IRCTC Share News) భారీగా నష్టపోయిన నేపథ్యంలో.. వ్యాపార వర్గాలు, మార్కెట్ నిపుణులు సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో గత్యంతరం లేక వెనక్కి తగ్గిన కేంద్రం.. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఐఆర్‌సీటీసీ షేర్లు మళ్లీ పుంజుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వేలోని క్యాటరింగ్‌, టికెట్‌ బుకింగ్‌, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌.. వంటి సేవల్ని ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. ఇందులో ఐఆర్‌సీటీసీదే పైచేయి. టికెట్‌ బుకింగ్‌లో 73 శాతం, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌లో 45 శాతం వాటా ఈ సంస్థకు ఉంది. దీంతో ఈ సంస్థలో వాటాలున్న సర్కార్‌.. టికెట్‌ బుకింగ్‌ ద్వారా వస్తోన్న కన్వీనియెన్స్‌ రుసుము ఆదాయంలో 50 శాతం తమకు ఇవ్వాలంటూ గురువారం ఐఆర్‌సీటీసీకి రైల్వేశాఖ లేఖ రాసింది.


కరోనా సంక్షోభానికి ముందు కన్వీనియెన్స్‌ ఫీజు ద్వారా ఐఆర్‌సీటీసీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.349.64 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక కరోనా విజృంభించిన 2020-21లోనూ రూ.299.13 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే కరోనా నేపథ్యంలో క్యాటరింగ్‌ సహా ఇతర సేవల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో 2020-21లో కన్వీనియెన్స్‌ ద్వారా వచ్చిన ఆదాయమే ఎక్కువగా ఉంది. దీంతో ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ప్రధానంగా ఆర్జించే దాని నుంచి ప్రభుత్వం వాటా అడగడంతో ట్రేడర్లు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు. షేర్లును అమ్మకాలకు పెట్టారు. దీంతో కంపెనీ షేర్లు ఓ దశలో 29 శాతం కుంగి 650 వద్ద ఇంట్రాడే నష్టానికి నమోదు చేశాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై మార్కెట్‌ నిపుణులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మదుపర్లకు మంచి లాభాల్ని తెచ్చిపెడుతున్న కంపెనీలో సర్కార్‌ జోక్యం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. కంపెనీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని విశ్లేషించారు.


దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన రైల్వేశాఖ.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విటర్‌లో వెల్లడించారు. దీంతో కంపెనీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. ఆ తర్వాత వెంటనే ఇంట్రాడే కనిష్ఠాలను ఏకంగా 39 శాతం ఎగబాకడం విశేషం. మధ్యాహ్నం 12:05 గంటల సమయంలో బీఎస్‌ఈలో ఐఆర్‌సీటీసీ ఒక్కో షేరు 5.39 శాతం నష్టంతో 864.70 వద్ద ట్రేడవుతోంది.


ఇటీవలి మార్కెట్‌ ర్యాలీలో భారీగా లాభపడ్డ ఐఆర్‌సీటీసీ.. బీఎస్‌ఈలో రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీల జాబితాలో చేరింది. ఆరు నెలల్లో ఏకంగా 239 శాతం రిటర్న్స్‌ (IRCTC Share Price) ఇచ్చింది. దీంతో సామాన్యులకు ధర అందుబాటులో లేకుండా పోవడంతో ఇటీవలే స్టాక్‌ స్ప్లిట్‌ చేశారు. పైగా షేరు విలువ అత్యధిక స్థాయికి చేరడంతో గత కొన్ని రోజులుగా ఈ స్టాక్‌ స్థిరీకరణ దిశగా సాగుతోంది.


Also Read: Petrol Price today: వరుసగా మూడో రోజూ పెట్రో బాదుడు- కొత్త రికార్డు స్థాయికి ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook