UPI New Changes 2024: యూపీఐలో మార్పులు, రోజుకు లిమిట్, పేమెంట్ ఛార్జీలు ఇలా
UPI New Changes 2024: ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ లావాదేవీలే కన్పిస్తున్నాయి. నగదు లావాదేవీలు చాలావరకూ తగ్గిపోతాయి. ఆన్‌లైన్ డిజిటల్ పేమెంట్స్ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల్లో చేసిన కొన్ని మార్పుల్ని తెలుసుకుందాం..
UPI New Changes 2024: యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్. మొబైల్ సహాయంతో క్షణాల్లో ఎక్కడికైనా, ఎవరికైనా చెల్లింపులు చేసే అద్భుతమైన విధానం. కరోనా కాలం నుంచి యూపీఐ చెల్లింపులకు ఆదరణ పెరిగింది. ఆ తరువాత అందరికీ ఇదే అలవాటుగా మారిపోయింది.
యూపీఐ లావాదేవీలు అత్యంత సులభంగా, ఎక్కడికెళ్లినా అందుబాటులో ఉండటంతో చాలమంది నగదు ఉంచుకోవడమే మానేశారు. అందుకే దేశంలోని డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ చెల్లింపులదే మెజార్టీ వాటా ఉంటోంది. యూపీఐ చెల్లింపుల్ని మరింత సులభతరం చేసేందుకు, సెక్యూర్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1 నుంచి కొత్త మార్పులు చేర్పులు చేసింది.
రోజుకు చేయాల్సిన యూపీఐ గరిష్ట చెల్లింపును 1 లక్ష రూపాయలు చేసింది ఆర్బీఐ. గతంలో అంటే డిసెంబర్ 8న ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా 5 లక్షల వరకూ చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు సాధారణ లావాదేవీల మొత్తాన్ని 1 లక్షకు పెంచింది. యూపీఐ పేమెంట్ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇతర బ్యాంకు యూపీఐ ఐడీలు ఏడాది పాటు వినియోగించకపోతే డీ యాక్టివేట్ చేయాలని బ్యాంకులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సూచించింది. ఆన్‌లైన్ వ్యాలెట్ ఆధారంగా పీపీఐ విధానంలో వ్యాపార యూపీఐ లావాదేవీలు 2 వేలు దాటితే 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్ ఫీజు ఉంటుంది.
ఆన్‌లైన్ పేమెంట్ విధానంలో జరుగుతున్న మోసాల్ని అరికట్టేందుకు కొత్త వ్యక్తికి మొదటిసారి 2 వేలు దాటి చెల్లింపు చేస్తుంటే..అవతలి వ్యక్తి ఆ నగదు పొందేందుకు 4 గంటల సమయం పడుతుంది. జపాన్ కంపెనీ హిటాచీ సహకారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ ఏటీఎంలను దేశవ్యాప్తంగా లాంచ్ చేస్తోంది. ఈ ఏటీఎంలలో యూజర్లు క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా తమ ఎక్కౌంట్లలోంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం కార్డు అవసరం ఉండదు.
గత ఏడాది ఆగస్టు నాటికి యూపీఐ 10 బిలియన్ల లావాదేవీలు దాటి రికార్డు నెలకొల్పింది. నెలకు 100 బిలియన్ల యూపీఐ లావాదేవీలు చేరుకునే సామర్ధ్యం దేశంలో ఉందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook