Gold Price History in India : ఆగస్టు 15, 1947న బంగారం ధరలు ఎలా ఉన్నాయి..తొలిసారి బంగారం ధర రూ. 1000 ఎప్పుడు దాటింది..?
Gold Price History : మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి బంగారం ధర 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 88 రూపాయలు ఉంది. ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది. 1950వ సంవత్సరంలో తొలిసారిగా పది రూపాయలు పెరిగిన బంగారం ధర రూ. 99కి చేరింది. 1947 నుంచి 2024 వరకు భారత దేశ చరిత్రలో బంగారం ధర ఎలా పెరుగుతూ వచ్చింది. భవిష్యత్తులో ఎంత పెరగనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Price History in India : బంగారంతో భారతీయులకు అవినాభావ సంబంధం ఉంది. బంగారం లేకుండా మన ఇంట్లో శుభకార్యం అనేది జరగదు. అందులోనూ దక్షిణ భారతదేశం వారికి బంగారం అంటే విపరీతమైనటువంటి ఇష్టం బంగారం అనేది జీవితంలో ఒక భాగంగా భావిస్తారు. బంగారాల్లో పెట్టుబడి పెట్టేందుకే జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాదు దాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తుంటారు. ఆస్తుల విభజనలో బంగారానికి కూడా ప్రధాన పాత్ర ఉంటుంది. ఇక దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున బంగారం ఉంటుంది.
ఇంతటి అనుబంధం ఉన్న బంగారం ప్రస్తుతం 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ. 71000 దాటింది. బంగారం ధర గడచిన పది సంవత్సరాల్లో చూసినట్లయితే దాదాపు మూడు రెట్లు పెరిగింది. అయితే బంగారం ధర భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఉంది అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతూనే ఉంటుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 వ సంవత్సరం బంగారం ధరలు ఎలా ఉన్నాయో అక్కడి నుంచి ప్రస్తుతం వరకు ఎలా పెరుగుతూ వచ్చాయో తెలుసుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 1947 ఆగస్టు 15వ తేదీన బంగారం ధర 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను 88 రూపాయలు ఉంది. ఆ తర్వాత 1950వ సంవత్సరానికి బంగారం ధర పెరుగుతూ 99 రూపాయల వరకు చేరుకుంది.
1959లో తొలిసారి రూ. 100 దాటిన బంగారం ధర:
1959 నాటికి బంగారం ధర తొలిసారి 100 రూపాయలు దాటి 102 రూపాయలు పలికింది. ఆ తరువాత 1962లో 119 రూపాయలుగా పలికింది. అయితే 1964లో బంగారం ధర ఒక్కసారిగా సగానికి సగం పడిపోయింది. అంటే 119 నుంచి 63 రూపాయలకు పతనమైంది. ఈ చారిత్రక కనిష్ట స్థాయి నుంచి బంగారం ధర నెమ్మదిగా రికవరీ అవుతూ, 1972వ సంవత్సరం తొలిసారిగా 200 రూపాయలు దాటి 202 రూపాయలుగా పలికింది. ఈ సంవత్సరం నుంచి బంగారం ధర వేగంగా పెరగడం ప్రారంభించింది. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే బంగారం ధర 200 రూపాయల నుంచి 500 రూపాయలకు పెరిగింది. 1974లో బంగారం ధర 506 రూపాయలుగా ఉంది. ఇక 1979 వ సంవత్సరంలో బంగారం ధర తొలిసారిగా 1 వెయ్యి రూపాయలు దాటింది.
1985లో ధర రూ. 2000 బంగారం :
1985 వ సంవత్సరం బంగారం ధర 2000 రూపాయలు దాటింది. 1988లో బంగారం ధర తొలిసారిగా 3000 రూపాయలు తాకింది. 1992లో బంగారం ధర తొలిసారి నాలుగువేల రూపాయలు తాకింది. ఆ తర్వాత బంగారం ధర 1996 ఐదువేల రూపాయలు దాటింది. అయితే అనూహ్యంగా బంగారం ధర 5 వేల రూపాయల నుంచి 1998 నాటికి 4000 రూపాయలకు పతనమైంది. అంటే మూడు సంవత్సరాల్లో దాదాపు 1000 రూపాయలు తగ్గింది. 2000 సంవత్సరం నాటికి బంగారం ధర రూ. 4400 ఉంది. ఇక్కడ నుంచి బంగారం ధర వేగంగా పెరగడం ప్రారంభించింది. 2007వ సంవత్సరానికి బంగారం ధర తొలిసారిగా పదివేల రూపాయలు దాటింది.
2010లో రూ. 20 వేలు :
ఆ తరువాత 2010 సంవత్సరం బంగారం ధర 20 వేల రూపాయలు దాటింది. కేవలం మూడు సంవత్సరాల రోజున బంగారం ధర డబుల్ అయింది. ఇక 2012 సంవత్సరంలో బంగారం ధర తొలిసారి 30 వేల రూపాయలు దాటింది. అయితే 30 వేల రూపాయల నుంచి 2015 వ సంవత్సరం 26వేల రూపాయలకు పతనమైంది. అంటే సుమారు 4000 తగ్గింది. మళ్లీ బంగారం ధర 2018 సంవత్సరం 30 వేల రూపాయలు దాటింది.
2020లో రూ. 50వేలు :
కోవిడ్ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 2020 సంవత్సరంలో బంగారం ధర తొలిసారిగా ఏకంగా 50 వేల రూపాయలు దాటింది. 2020 నుంచి 2024 వరకు గమనిస్తే బంగారం ధర దాదాపు చారిత్రక గరిష్ట స్థాయి అయినా 75 వేల రూపాయలు దాటింది. ఇక్కడ నుంచి బంగారం ధర స్వల్పంగా కరెక్షన్ అయ్యి ప్రస్తుతం 71 వేల రూపాయల వద్ద ఉంది. పైన పేర్కొన్న ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల విలువైన బంగారానివిగా గుర్తించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook