Farmers Arrested: మళ్లీ రైతులకు సంకెళ్లు వేసిన తెలంగాణ పోలీసులు
Hyderabad Regional Ring Road News: వారేమీ కరుడు గట్టిన నేరస్థులు కాదు, దేశ ద్రోహులు అంతకంటే కాదు. ఇంకా నిజం చెప్పాలంటే వాళ్లు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు. సమాజంలో తొలి స్థానంలో గౌరవం పొందాల్సిన రైతులు... దేశం కోసం పలుగు, పార, నాగలి చేతబట్టి రేయింబవళ్లు మట్టిలో గడిపే సైనికులు.
Hyderabad Regional Ring Road News: వారేమీ కరుడు గట్టిన నేరస్థులు కాదు, దేశ ద్రోహులు అంతకంటే కాదు. ఇంకా నిజం చెప్పాలంటే వాళ్లు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు. సమాజంలో తొలి స్థానంలో గౌరవం పొందాల్సిన రైతులు... దేశం కోసం పలుగు, పార, నాగలి చేతబట్టి రేయింబవళ్లు మట్టిలో గడిపే సైనికులు. కష్టాలు, కన్నీళ్ళని దిగ మింగుకుని... నష్టాల పాలైనా అందరికీ కడుపు నింపే కల్మషం లేని కర్షకులు. అలాంటి అన్నదాత ఘోరంగా అవమానపడ్డాడు. వారిని దోపిడీ దొంగల్లా, కరడుగట్టిన హంతకుల్లా సంకెళ్లు వేసి జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. తోటి రైతులు, జనం అందరూ చూస్తుండగానే... ఏదో చేయరాని నేరం చేసినట్లుగా పోలీసులు వారిని కోర్టుకు ఈడ్చుకెళ్లారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి అనేక సందేహాలు లేవనెత్తుతోంది. అభం శుభం తెలియని, తమ పనులు తాము చేసుకునే రైతుల పట్లనే పోలీసులు ఇంత కర్కషంగా ఉంటే.. ఇక సమాజం పట్ల వీరి వైఖరి ఇంకెలా ఉంటుంది అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఇదిగో ఇక్కడ సంకెళ్లతో ఉన్న రైతులను చూసారా... ఇంత క్రూరంగా కోర్టుకు తీసుకెళ్తున్నారు కదా... పాపం రైతన్నలను తప్పు బట్టకండి. ఎందుకంటే వీళ్లేం హత్యలు, మానభంగాలు చేయలేదు. ఇంతకీ వీరు చేసిన నేరం ఏంటో తెలుసా. పుడమి తల్లినే నమ్ముకున్న తమ కడుపు కొట్టొద్దనీ ప్రభుత్వాన్ని ప్రాధేయ పడడమే వీరు చేసిన నేరం. భువనగిరి మండలం రాయగిరి నుంచి రీజనల్ రింగ్ రోడ్ విస్తరణలో బాగంగా భూములు కోల్పోతున్న అభాగ్యులు వీరు. RRR ప్రతిపాదన మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం ఈ సంకెళ్లకు కారణమైంది.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత నెల 30వ తేదీన బాధిత రైతులు అందరితో కలిసి ఈ రైతులు కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. దాంతో సదరు రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. మంగళవారం వారిని జైలు నుంచి భువనగిరి కోర్టుకు హాజరు పరిచేందుకు తీసుకు వెళ్లే క్రమంలో, పోలీసులు రైతులకు సంకెళ్లు వేయడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఘటనపై మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు మండపడుతున్నాయి. ఆ రైతులు ఏం పాపం చేశారని సంకెళ్లు వేశారని మానవ హక్కులు నేతలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ఖమ్మం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.