Buy 1, Get 1 free Offer Scams: ప్లేట్ మీల్స్ భోజనం ఖరీదు రూ. 90 వేలు
Buy 1, Get 1 free Offer Scams: ప్లేట్ మీల్స్ భోజనం ఖరీదు రూ. 90 వేలు అనే టైటిల్ చూసి ఆ భోజనం ఖరీదు అంత భారీగా ఉండటానికి ఆ భోజనం ఏం ఉంటుంది ? ఏం చేసి వడ్డిస్తారు అని రకరకాలుగా ఆలోచించకండి.. ఎందుకంటే ఇది వాస్తవానికి ఆ భోజనం కోసం చెల్లించిన ఖరీదు కాదు.. ఆమాటకొస్తే అసలు ఆ భోజనం కూడా ఉచితమే.. మరి ఈ రూ. 90 వేల మ్యాటరేంటి అనే కదా మీ డౌట్.. యస్ అక్కడికే వస్తున్నాం.
Buy 1, Get 1 free Offer Scams: ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్ చేసేటప్పుడు ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే బోలెడు ఆఫర్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం కదా.. అలానే ఢిల్లీకి చెందిన సవితా శర్మ అనే 40 ఏళ్ల మహిళకు కూడా ఒక ప్లేట్ భోజనంతో మరొక ప్లేట్ భోజనం ఫ్రీ అనే ఆఫర్ కనపడింది. బ్యాంకులో పనిచేసే ఉద్యోగిని అయ్యుండి కూడా ఫ్రీగా వచ్చే అనేక ఆఫర్ల వెనుక ఏదో ఒక మోసం ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోయిన సవితా శర్మ.. ఆ ఫ్రీ మీల్స్ ఆఫర్‌కి పడిపోయింది. ఫేస్‌బుక్‌లో సాగర్ రత్న అనే ఒక రెస్టారెంట్ పేరుతో కనిపించిన నెంబర్‌కి ఫోన్ చేసింది. అటువైపు నుంచి రిప్లై రాలేదు కానీ వెంటనే ఒక కాల్ బ్యాక్ వచ్చింది. అక్కడి నుంచే అసలు మోసం మొదలైంది.
సవితా శర్మకు ఫోన్ చేసిన సదరు కాలర్.. తనని తాను సాగర్ రత్న రెస్టారెంట్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. ఒక లింకుని పంపించి ఆ లింకు ద్వారా వచ్చిన మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందిగా చెప్పాడు. ఆ తరువాత తమ సూచనలు ఫాలో అయితే మీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది అని చెప్పాడు. ఆ కాలర్ చెప్పినట్టుగానే చేసిన సవితా శర్మ.. అతడు ఇచ్చిన యూజర్ ఐడి, పాస్ వర్డ్ ఎంటర్ చేసి ఆ యాప్‌లోకి లాగిన్ అయింది. ఆ యాప్‌లోకి లాగిన్ అయిన వెంటనే ఆమె ఫోన్ తన చేతిలోంచి కంట్రోల్ తప్పి మరొకరి చేతిలోకి వెళ్లిపోయింది. ఎక్కడో ఉన్న ఎవ్వరో అజ్ఞాత వ్యక్తి ఆమె ఫోన్‌ని రిమోట్‌లోకి తీసుకుని ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు.
ఆ తరువాత కొద్దిసేపటికే సవితా శర్మ ఎకౌంట్లోంచి రూ. 40,000 విత్ డ్రా అయినట్టుగా తన ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరోసారి రూ. 50 వేలు కట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. మొత్తం రూ. 90 వేలు డెబిట్ అవడంతో తేరుకున్న సవితా శర్మ వెంటనే తన క్రెడిట్ కార్డుని బ్లాక్ చేయించింది. అదేంటి.. క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు ఏలా పోయాయని అనుకుంటున్నారా ? మరేం లేదు.. ఆ సైబర్ మోసగాడు ముందుగా సవితా శర్మ క్రెడిట్ కార్డులోంచి ఆమె పేటీఎం వ్యాలెట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్ చేసి మరి.. ఆ తరువాత ఆమె పేటీఎంలోంచి డబ్బులు డ్రా అయ్యాయి. ఇదే విషయమై సవితా శర్మ సైతం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. హ్యాకర్స్ తన క్రెడిట్ కార్డులోంచి పేటీఎంలోకి డబ్బులు పంపించి మరీ అక్కడి నుంచి డబ్బులు కాజేశారని వాపోయారు. తనకు తన సమీప బంధువు ఒకరు ఈ లింక్ పంపించారు అని.. అందుకే నమ్మకంతో లాగిన్ అయ్యానని సవితా శర్మ చెప్పుకొచ్చారు.
సవితా శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సౌత్ వెస్డ్ ఢిల్లీ పోలీసులు.. సాగర్ రత్న రెస్టారెంట్‌కి వెళ్లి విచారించగా.. ఈ తరహా హ్యాకర్స్ బారిన పడి మోసపోయిన వారి సంఖ్య చాలా పెద్దదే ఉంది అని అర్థమైంది. తమకు చాలామంది కస్టమర్స్ ఫోన్ చేసి సాగర్ రత్న పేరుతో ఇలా డబ్బులు కట్ అయ్యాయని అడుగుతున్నారని.. కానీ ఆ మోసానికి తమకు ఎలాంటి సంబంధం లేదు అని సాగర్ రత్న రెస్టారెంట్ యజమాని సెలవిచ్చాడు. అసలు ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తాము ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు.. ఎలాంటి ఆఫర్స్ అందివ్వడం లేదు అని సాగర్ రత్న రెస్టారెంట్ సిబ్బంది తెలిపారు.
ఒక రెస్టారెంట్ పేరుతో సవితా శర్మ మోసపోయిన తీరు చూస్తోంటే.. బై వన్ గెట్ వన్ ఫ్రీ మీల్స్ బాధితుల సంఖ్య భారీ సంఖ్యలోనే ఉంది కానీ చెప్పుకుంటే సిగ్గుచేటు అనే భావనతోనే చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారని ఈ ఘటన నిరూపించింది. ఆన్‌లైన్‌లో కనిపించే ఆఫర్స్ వెనుక ఉండే మోసాల గురించి తెలుసుకోకుండా కక్కుర్తిపడితే ఇలా హ్యాకర్స్ చేతిలో మోసపోవాల్సి వస్తుందని ఇప్పటికే ఎన్నో సైబర్ క్రైమ్స్ నిరూపించాయి. బ్యాంకులో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటీవ్ అయ్యుండి కూడా ఒక మహిళ సైబర్ క్రిమినల్స్ చేతిలో రూ. 90 వేలు మోసపోయిన తీరు కూడా అలాంటిదే.