Thief Booked Cab to Escape: వ్యాపారి ఇంట్లో చోరీ.. క్యాబ్ బుక్ చేసుకుని మరీ పరారీ.. అరెస్ట్
Thief Booked Cab to Escape: ఇదొక వెరైటీ చోరీ కేసు... సినీ ఫక్కీలో రెక్కీ నిర్వహించి మరీ చోరీకి వచ్చిన దొంగ.. యజమాని కుటుంబసభ్యులను బెదిరిస్తూ రాత్రంతా ఆ ఇంట్లోనే గడిపాడు. తెల్లవారే సమయానికి ఇంట్లో వారి చేతే క్యాబ్ బుక్ చేయించుకుని రూ. 10 లక్షల నగదుతో పరారయ్యాడు. ఇంతకీ పోలీసులకు ఎలా చిక్కాడంటే...
Thief Booked Cab to Escape: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వ్యాపారి ఎన్‌ఎస్‌ఎన్ రాజు ఇంట్లో సినీ ఫక్కీలో జరిగిన చోరీ కేసును వెస్ట్ జోన్ పోలీసులు ఛేదించారు. మే 12న జరిగిన దోపిడీ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ చోరీ కేసు వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 52లోని వ్యాపారి ఎన్‌ఎస్‌ఎన్ రాజు ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడు.. రాజు కుమార్తె, గర్భిణి అయిన నవ్య మెడపై కత్తి పెట్టి నగదు దోచుకెళ్లాడు. నిందితుడు ముందుగా రెక్కీ నిర్వహించిన తరువాతే ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అర్ధరాత్రి దాటాక ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆరు గంటల పాటు అక్కడే ఉన్నాడు. నవ్య మెడపై కత్తి పెట్టి రూ. 20 లక్షలు ఇవ్వాల్సిందిగా బెదిరించిన నిందితుడు.. ఇంట్లో ఉన్న 10 లక్షలు దోచుకుని పారిపోయాడు.
నవ్య ఫోన్ నుంచే క్యాబ్ బుకింగ్
నగదు తీసుకొని పారిపోయే క్రమంలో నవ్య ఫోన్ నుంచి క్యాబ్ బుకింగ్ చేసుకుని మరీ పరారవడం గమనార్హం. నవ్య ఫోన్ ద్వారానే క్యాబ్ బుక్ చేయించుకొన్న నిందితుడు మోతి రామ్ రాజేష్ యాదవ్.. జూబ్లీహిల్స్ నుంచి నేరుగా షాద్ నగర్ వెళ్ళాడు. రాజేశ్ ఉండేది సికింద్రాబాద్ అయినప్పటికీ.. నేరుగా అక్కడికే వెళ్తే అక్కడి సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా పోలీసులకు దొరికిపోవడం సులభం అని భావించడంతో పాటు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తొలుత షాద్ నగర్ వెళ్లాడు.
అయితే, రాజు కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి విచారణ చేపట్టిన వెస్ట్ జోన్ పోలీసులు.. నిందితుడు కోసం అతడిని షాద్ నగర్ లో దించేసిన క్యాబ్ డ్రైవర్ ని విచారించారు. అతడిని షాద్ నగర్లో దించేశానని అతడు చెప్పడంతో అక్కడి సీసీ ఫుటేజ్, CDR అనాలసిస్ ఆధారంగా దర్యాప్తు చేశారు. అంతేకాకుండా నవ్య సెల్ ఫోన్‌పై నమోదైన ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్, ఫింగర్ ప్రింట్స్, సీడీఆర్ అనాలసిస్ వంటి సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్టు సీపీ సీవీ ఆనంద్ స్పష్టంచేశారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన నిందితుడు రాజేష్ యాదవ్ ని అరెస్ట్ చేసి అతడి నుంచి కత్తి, సెల్ ఫోన్ తో పాటు 9.5 లక్షలు రికవరీ చేశారు.