Crime News: బామ్మర్దిపై ఉన్న కోపంతో అతడి భార్యపై.. అతి కిరాతకంగా..
Man killed Pregnant Woman: చెల్లెలి కాపురం సరిదిద్దాలని ఓ అన్న చేసిన ప్రయత్నం అతడిని తన బావ దృష్టిలో శత్రువును చేసింది. మరోవైపు బావమరిదిపై కోపంతో అతడి ఇంటికి వెళ్లిన బావకు ఆ సమయంలో బావమరిదికి బదులు అతడి భార్య కనిపించింది.
Man killed Pregnant Woman: చెల్లెలి కాపురం సరిదిద్దాలని ఓ అన్న చేసిన ప్రయత్నం అతడిని తన బావ దృష్టిలో శత్రువును చేసింది. అదనపు కట్నం కోసం ఆశపడటమే కాకుండా... భార్యను వేధించి పుట్టింటికి వెళ్లిపోయేలా చేసి తన కాపురం తనే చెడగొట్టుకున్న ఓ దుర్మార్గుడు.. అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా తన కాపురం చెడిపోవడానికి తన బావమరిదే కారణం అని ఆగ్రహం పెంచుకున్నాడు. అదే ఆవేశంతో బావమరిది ఇంటికి వెళ్లి తన ఆగ్రహాన్ని తీర్చుకోవాలనుకున్నాడు. ఆ ఆవేశంలో ఆ దుర్మార్గుడు చేసిన క్షమించరాని నేరం రెండు కుటుంబాల్లో తీరని శోకం నింపింది. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటి ? ఎక్కడ జరిగిందీ ఘటన.. పూర్తి వివరాలు.
మధ్యవర్తిత్వమే పాపమైందా.. ?
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన కావూరు శ్రీరామకృష్ణకు లక్ష్మీ ప్రసన్నకు రెండేళ్ల క్రితం వివాహమైంది. లక్ష్మీ ప్రసన్న పెళ్లి విషయంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన తన పెద్దమ్మ కుమారుడు వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా వ్యవహరించాడు. తన చిన్నమ్మ కూతురైన లక్ష్మీ ప్రసన్నకు సంబంధం కుదిర్చి, పెళ్లి చేయడంలో వెంకట రామకృష్ణ అంతా తానై ముందుండి నడిపించాడు. అయితే, పెళ్లయిన కొన్ని నెలలకే శ్రీరామకృష్ణ అదనం కట్నం కోసం భార్య లక్ష్మీ ప్రసన్నను వేధించసాగాడు. అతడి వేధింపులు తారాస్థాయికి చేరడంతో చివరకు లక్ష్మీ ప్రసన్న అతడి వేధింపుల గురించి పుట్టింటి వారికి, అన్న వెంకట రామకృష్ణకు చెప్పుకుని బోరుమంది. దీంతో చెల్లి కాపురం సరిదిద్దే ప్రయత్నాల్లో భాగంగా గతేడాదే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టిన వెంకట రామకృష్ణ.. బావ శ్రీరామకృష్ణకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ శ్రీరామకృష్ణ వినిపించుకోలేదు.
భర్తను దూరం పెట్టిన లక్ష్మీ ప్రసన్న..
భర్త శ్రీరామకృష్ణ వైఖరితో విసిగిపోయిన లక్ష్మీ ప్రసన్న.. అక్కడి నుంచి పుట్టింటికి తిరిగొచ్చి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసుకుంటున్నారు. అయినప్పటికీ భర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో నెల రోజుల క్రితమే లక్ష్మీ ప్రసన్న తన భర్త, అత్తింటి వారిపై చందానగర్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. లక్ష్మీ ప్రసన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. ఇటీవలే శ్రీరామకృష్ణ వివరణ కోరుతూ అతడికి నోటీసులు జారీచేశారు.
బామ్మర్ధిపై ప్రతీకారం తీర్చుకునేందుకు పథకం..
చందానగర్ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న శ్రీరామకృష్ణ తను చేసిన తప్పేంటో తెలుసుకోకపోగా.. తన భార్య తనపై కేసు పెట్టడానికి ఆమె అన్న వెంకట రామకృష్ణే కారణం అని భావించి అతడిపై కసి పెంచుకున్నాడు. బావమరిదిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన శ్రీరామకృష్ణ.. హైదరాబాద్ ఎర్రగడ్డలో ఓ వేట కొడవలి కొనుగోలు చేశాడు. వేట కొడవలితో నేరుగా గచ్చిబౌలిలో వెంకట రామకృష్ణ ఉంటున్న ఇంటికే వెళ్లాడు.
చక్కటి సంసారంలో చిచ్చుపెట్టిన పగ..
వెంకట రామకృష్ణ, స్రవంతి దంపతులకు పదేళ్ల కుమార్తె ఉండగా.. ప్రస్తుతం స్రవంతి నిండు గర్భంతో ఉంది. శ్రీరామకృష్ణ వేటకొడవలితో వెంకట రామకృష్ణ ఇంటికి వెళ్లిన సమయంలో అతడు ఇంట్లో లేడు. తన కూతురుని స్కూల్ నుంచి తీసుకురావడానికని బయటికి వెళ్లాడు. అదే సమయంలో వేటకొడవలి పట్టుకుని ఇంటికి వచ్చిన శ్రీరామకృష్ణను చూసిన స్రవంతి.. గట్టిగా కేకలు వేస్తూ ఇంట్లోంచి బయటకు పరుగెత్తే ప్రయత్నం చేసింది. కానీ బావమరిది వెంకట రామకృష్ణపై ఉన్న కోపంతో స్రవంతి నిండు గర్భిణి అనే విచక్షణ కూడా లేకుండా ఆమెను అదే వేటకొడవలితో నరికి అక్కడి నుంచి పరారయ్యాడు. స్రవంతి అరుపులు, కేకలు విన్న చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చేటప్పటికే.. ఆమె రక్తపు మడుగులో పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు.
చివరికి మిగిలిందిదే..
వెంకట రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడు శ్రీరామకృష్ణను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ నెల 6వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అదనపు కట్నం కోసం కక్కుర్తి పడి తనే తన కాపురాన్ని చెడగొట్టుకున్నాను అనే విషయం బోధపడని శ్రీరామకృష్ణ.. తన కాపురం చెడిపోవడానికి బావమరిదే కారణం అని భావించి అతడిపై పగ పెంచుకున్నాడు. అదే ఆవేశంలో తనకు తెలియకుండానే తనకు చెల్లి అయిన బావమరిది భార్య స్రవంతిని నరికిచంపాడు. శ్రీరామకృష్ణ చేసిన హత్య బావమరిది కుటుంబంలో శోకం నింపడంతో పాటు అతడిని కటాకటాల పాలుచేసింది.