చిన్న సినిమాల  విషయానికి వస్తే ప్రస్తుతం కొత్త కథనం ఉంటే తప్ప ప్రేక్షకులు ప్రోత్సహించటం లేదు. ప్రేక్షకుల ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త కథతో ముందుకు వచ్చిన సినిమా 7:11PM.  ఒక ఊరు, రెండు గ్రహాలు మరియు మూడు గ్రహాల లాంటి ఆసక్తికర కథతో.. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ముందుకు వచ్చింది. ఈ సినిమాలో చైతు మాదల దర్శకుడుగా పరిచయం అవటం.. అందరు కొత్త నటీనటులతో నిర్మించారు. అసలు కథ ఏంటంటే..?
ఆ ఊరిపేరు హంసలదీవి 1990, రవి (సాహస్) మెకానిక్ షెడ్ నడుపుతుంటాడు. అదే ఊరిలో ఉంటున్న విమల (దీపిక)తో ప్రేమలో పడతాడు. అదే ఊర్లో..  ‘అపరిమిత మ్యూచువల్ ఫండ్స్’ అనే సంస్థ 4 రూపాయల వడ్డీని ఇస్తామని చెప్పి ప్రజల డబ్బు తీసుకొని  ప్లేటు పేరాయించాలని చూస్తుంటారు.. మరోవైపు అదే ఊర్లో ఉంటున్న రాజకీయ మంత్రి డ్యామ్ కట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే డ్యామ్ పేరుతో న్యూక్లియర్ వ్యర్ధాల డంప్ నిర్మించాలనేది మంత్రి కుట్ర. ఇదే సమయంలో 4000 సంవత్సరాల భవిష్యత్ కాలం నుండి వచ్చిన ఇద్దరు గ్రహాంతర వాసులు హంసలదీవి వచ్చి.. పుస్తకం కోసం వెతుకుతుంటారు. ఈ 3 కథలు నడుస్తూన్న సమయంలో రవి ఒక అజ్ఞాత వ్యక్తితో కలిసి స్పేస్ క్రాఫ్ట్ ఎక్కి 2024  సంవత్సరానికి చేరుకుంటాడు. 2024 లో డ్యామ్, ‘అపరిమిత మ్యూచువల్ ఫండ్స్’ ఎలా ఉన్నాయి..? రవి వెనక్కి వెళ్లాడా..? పరిస్థితులని  దిద్దాడా..? ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేదే సినిమా కథ. 
కథ: 
కథలు పేపర్  బాగున్నపాటీకి.. వాటిని తెరపై చూపించే ప్రయత్నంలో పేపర్ లో ఉన్న మ్యాజిక్, ఎమోషనల్ రెండూ మిస్ అవుతాయి. 7: 11PM కోవాకి చెందిన సినిమామనే. ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్న తెరపై ఆ ఎమోషన్ సరిగా కనెక్ట్ అవలేదనే చెప్పాలి.  ఇది వరకు వచ్చిన టైం ట్రావెల్ లాంటిదే ఇది కూడా.. కానీ ఒక గ్రామంలో కథ మొదలై.. హంసల దీవి అనే ఊరిలోనే ఇంట్రవెల్ వరకూ కొనసాగుతుంది. 
ఎలా ఉందంటే..?
ఒక వెబ్ సిరిస్ డీల్ చేసినట్లు ప్రతి పాత్ర చుట్టూ అనవసరమైన డ్రామాని నడిపారు. హీరో హీరోయిన్ లవ్ స్టొరీ, హీరోకి ఊరు మీద వున్న ప్రేమ, అపరిమిత మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్‌, న్యూక్లియర్ డ్యామ్, హీరో తండ్రి చావుకి కారకులు, వేరే గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులు.. ఇలా ఎన్నో ట్రాకులు ఫస్ట్ హాఫ్ లోనే చెప్పేయాల‌నుకొనే ప్రయత్నం.. కంగాళీగా మారిపోయింది. హీరో ఫ్రెండ్స్‌ గ్యాంగ్ తో కలసి మ్యూచువల్ ఫండ్స్ ని డబ్బుని కాజేస్తుంటాడు. ఆ ట్రాక్ ఏమిటో చాలా సేపటి వరకూ క్లారిటీ వుండదు. దర్శకుడికి ఈ విషయంలో క్లారిటీ ఉండొచ్చు. కానీ చూస్తున్న ప్రేక్షకుడికి కూడా ఆ తంతు అర్ధమైనప్పుడే ఆ డ్రామాకి కనెక్ట్ అవ్వగలడు. ఇదే కాదు ఇందులో చాలా ఎలిమెంట్స్ అలా క్లారిటీ లేకుండా వుంటాయి. పైగా చాలా ఎమోషన్స్ ని చెప్పేయాలనుకునే ప్రయత్నం కూడా దెబ్బకొట్టింది. కొత్తవాళ్ళతో సినిమా చేసిన్నప్పుడు వాళ్ళ ఇమేజ్ ఏమిటి ? అనే స్ప్రూహతో కథలు రాసుకోవాలి. ఓ పెద్ద స్టార్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాయడం తప్పుకాదు. కానీ అదే కథని ఓ కొత్త కుర్రాడితో తీసేయడం ముమ్మాటికీ తప్పే. కొత్త ముఖం వున్నప్పుడు ఆ పాత్రని రిజిస్టర్ చేసుకోవడానికే కాస్త టైం పడుతుంది. అలాంటింది ఏకంగా ఆ పాత్రతో కాలాలు, గ్రహాలు జంప్ చేయించేయడం అంత తెలివైన పని కాదు. పై ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఆశ్రయించిన కొన్ని ఎలిమెంట్స్ కూడా అనవసరం అనిపిస్తుంది. హీరో ఒక అనాధ టైపు క్యారెక్టర్. ఆ ఊరు అతడిని ఆదరిస్తుంది. అలాంటి ఊరుకే ఆపద వస్తే అతడు ఎంతకైనా తెగిస్తాడనేది చెప్పడం దర్శకుడి ఉద్దేశంగా కనిపించింది. ఇలాంటి ఉద్దేశం వున్నప్పుడు ఆ ఊరుని జీవం వుట్టిపడేట్లు చూపించాలి. ఆ మనుషులు, వాళ్ళ ప్రేమలు, అభిమానులు ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి. అలా కాకుండా ఊరు పై ఒక ఏరియల్ షాట్ వేసి.. కూతురు పెళ్లి కోసం మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బుని దాచుకున్న ఓ పెద్దమనిషిని చూపించి.. అదే వూరు.. అదే ప్రేమ అనుకోవాలంటే కష్టం. ఇంటర్వెల్ బాంగ్ తో అసలు కథ మొదలుపెట్టాడు దర్శకుడు. ఐతే తర్వాత నడిపిన కథనం కాస్త లేజీగా వుంటుంది. హీరో తాను 2024లో వున్నానని తెలుసుకోవడానికి దాదాపు చాలా స్క్రీన్ టైం పట్టేస్తుంది. ఇలాంటి కథకు అంత లాగ్ అనవసరం. ట్రైలర్ కట్ లోనే ఈ కథ చెప్పినపుడు సినిమాలో దానిని మరింత స్పీడ్ గా రన్ చేయాల్సింది. అలాగే ఈ కథని తన సౌకర్యానికి అనుగుణంగా రాసుకున్నాడు దర్శకుడు. ఆస్ట్రేలియాలో హీరో, సారాకి పరిచయం అవ్వడం, సారా తండ్రి ఒక స్పేస్ సైంటిస్ట్ కావడం, రవి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మార్గం దొరకడం.. ఇవన్నీ కథలో సహజంగా కాకుండా కల్పించుకొని రాసినట్లు వుంటుంది. పైగా ఓ అపరిచితుడు రూపంలో ఈ కథ కాసేపు సైకో కిల్లర్ డ్రామాగా కూడా కనిపిస్తుంది. ఐతే రవి మళ్ళీ వెనక్కి వెళ్లి జరిగిపోయిన దానిని మార్చడానికి చేసిన ప్రయత్నం మాత్రం ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వున్న వేగం, వినోదం సినిమా మొత్తంలో పాటించివుంటే 7: 11PM కాస్త బెటర్ గా వుండేది. 
ఎవరెలా చేసారంటే..?
రవి పాత్ర చేసిన సాహస్ తన పాత్ర మేరకు రాణించాడు. తన నటన సహజంగానే వుంది. అలాగే విమల పాత్రలో చేసిన దీపిక పల్లెటూరి అమ్మాయిల డీసెంట్ గా కనిపించింది. సారా పాత్రలో చేసిన నటి కూడా ఆకట్టుకుంది. భరత్ రెడ్డిది కూడా కీలకమైన పాత్రే. చివర్లో ఆ పాత్రలో ఇంకో ఉపకథ చెప్పేయాలని ప్రయత్నం చేశాడు దర్శకుడు. రైజింగ్ రాజు పాత్రని పెక్యులర్ గా డిజైన్ చేశారు. చివర్లో కాసేపు నవ్విస్తాడు. మంత్రి పాత్ర చేసిన నటుడడితో మిగతా పాత్రలు పరిధి మేర చేశాయి. చిన్న సినిమా ఇది. అయినప్పటికీ లార్జర్ దెన్ లైఫ్ కంటెంట్ తో మెప్పించాలని చేసిన దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోవాల్సిందే. ఈ మధ్య చిన్న సినిమాలు అంటే పెళ్లి, ప్రేమ, యంగేజ్ మెంట్ చుట్టూ మాత్రమే ఆలోచిస్తున్నారు దర్శకులు. కానీ కొత్త దర్శకుడు చైతు మాదల మాత్రం ఒక టైం ట్రావెల్ కథని చెప్పాలని చూశాడు. అయితే దీని కోసం ఇంకాస్త బలంగా వర్క్ చేయాల్సింది. కొన్ని చోట్ల మెప్పిస్తాడు కానీ ఇంకొన్ని చోట్ల మాత్రం లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. జపాన్ వాడు వచ్చి హంసలదీవిలో న్యుక్లియర్ డంప్ యార్డ్ పెట్టుకోగలడా? దేశ రక్షణకి సంబందించిన న్యుక్లియర్ లాంటి ప్రాజెక్ట్స్ కి ఓ వూరు పెద్ద సంతకంతో గ్రీన్ సిగ్నల్ పడిపోతుందా ? కథలో కీలకమైన ఇలాంటి అంశాలు ఇంకాస్త లోతుగా స్టడీ చేయాల్సింది. అలాగే ఒక పుస్తకానికి డీఎన్ఏ లాక్, గ్రహాంతర వాసులు భవిష్యత్ లో ఎదురుకునే బ్రెయిన్ డెడ్ ఇష్యూ .. ఇలాంటి అంశాలని కేవలం డైలాగులతో తేల్చేశాడు. ఇందులో అసలు కథ అంతా వాయిస్ ఓవర్ లోనే వుంటుంది. ఆ మాటల్ని సరిగ్గా వింటేనే ఆ టైం ట్రావెల్ అర్ధమౌతుంది. కాస్త పరధ్యానంగా వున్నా సరే.. మిగతా ప్రయాణం అర్ధం కాకపోయే ప్రమాదం వుంది. సినిమాని విజువల్ మీడియా అనేది అందుకే. ఇక్కడ ఏది చెప్పిన చూపించాలి. కానీ చాలా వరకూ వాయిస్ ఓవర్ మీదే డిపెండ్ అయిపోయాడు దర్శకుడు . పాటలు, నేపధ్య సంగీతం అంత ఎఫెక్టివ్ గా వుండవు. చిన్న సినిమా అయినప్పటికీ తమ శక్తి మేర సీజీ వర్క్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ రోజుల్లో థియేటర్లో సినిమా చూడాలంటే ఎదో కొత్తదనం, కొత్త ప్రపంచం వుండాలి. అలాంటి కొత్త ప్రయత్నమే జరిగింది. అయితే ప్రయత్నం మాత్రం ప్రేక్షకులని అంతగా ఆకట్టుకునేలా ఉండదనే చెప్పాలి 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేటింగ్: 2.75/5 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook