తెలుగులో `అర్జున్ రెడ్డి`.. తమిళంలో `వర్మ`..!
లో బడ్జెట్ చిత్రంగా విడుదలై ఇండస్ట్రీలో కనీవినీ ఊహించని సక్సెస్ కైవసం చేసుకున్న చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. విజయ్ దేవరకొండ యాక్టింగ్.. సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్ కుర్రకారునే కాదు.. యావత్ తెలుగు చిత్రసీమనే ఉర్రూతలూగించాయి. బోల్డ్ సబ్జెక్ట్స్ తెలుగులోకి కూడా దూసుకొచ్చేస్తున్నాయి! అని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అయిదు కోట్ల రూపాయలతో తీసిన ఈ చిత్రం దాదాపు 50 కోట్ల వసూళ్లను సాధించింది.దాంతో ఇతర భాషల్లో కూడా చిత్రాన్ని రీమేక్ చేయడానికి కొందరు నిర్మాతలు మొగ్గు చూపారు. తమిళ నిర్మాతలకు ఆసక్తిని కలగజేసిన ఈ సినిమా కోలీవుడ్ రైట్స్‌ని ఇటీవలే విక్రమ్ తనయుడు ధ్రువ దక్కించుకున్నారు. ఈ చిత్రంతో హీరోగా తెరంగ్రేటం చేయబోతున్న ధ్రువ, తన దర్శకుడిగా బాలను ఎంచుకున్నారు. అయితే.. తమిళంలో రాబోతున్న ఈ సినిమాకి "వర్మ" అని పేరు పెట్టడం విశేషం. ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమాకి ఫ్యాన్ అయిపోయానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫేస్బుక్ వేదికగా తన భావాలు పంచుకున్నారు. ఈ సమయంలో ఈ చిత్రానికి తమిళంలో వర్మ పేరు పెట్టడం చర్చనీయాంశమైంది.