Bimbisara Review: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమా ఎలా ఉందంటే?
Bimbisara Movie Review and Rating In Telugu: పటాస్ సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఈమేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
Bimbisara Movie Review and Rating In Telugu: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హిట్ అందుకుని అలా కాలమే అయింది. చివరిగా పటాస్ అనే సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత నుంచి సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా అందుకోలేకపోయాడు. తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ విఫలమవుతూనే వస్తున్న నేపథ్యంలో బింబిసార అనే ఒక భారీ బడ్జెట్ సినిమా చేశారు. కొత్త దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తన సొంత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద తన బావమరిది కొసరాజు హరికృష్ణ చేత నిర్మింప చేశారు. ఈ సినిమా ముందు నుంచి పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. కానీ ఎప్పుడైతే ప్రమోషన్స్ మొదలుపెట్టారో అప్పటినుంచి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. బాహుబలి లాంటి విజువల్స్ తో విడుదల చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఇక అంచనాలను మరింత పెంచే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడంతో సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
బింబిసార కథ ఏమిటంటే?
త్రిగర్తల అనే ఒక రాజ్యాన్ని పరిపాలించే బింబిసారుడు(కళ్యాణ్ రామ్) అనే చక్రవర్తి తీవ్రమైన రాజ్య కాంక్షతో రగిలిపోతూ ఉంటాడు. అణువణువునా అహంభావంతో తొణికిసలాడే ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం. తన మాటకు ఎదురు చెబితే సొంత మంత్రిని కూడా క్షణాల్లో చంపి అవతలపారేయగల అహంభావి. అలాంటి బింబిసారుడు అనుకోకుండా టైం ట్రావెల్ ద్వారా ఐదవ శతాబ్దం నుంచి 2021కి వచ్చేస్తాడు. అలాంటి అహంభావి బింబిసారుడు నేటి సమాజంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తాడా? లేదా? వచ్చిన తర్వాత ఆయనకు ఎదురైన పరిణామాలు ఏమిటి? వాటిని బింబిసారుడు ఎలా ఫేస్ చేశాడు? ఈ కథలో రాజకుమారి ఐరా(కేథరిన్) సహా మిగతా వారి పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు బాహుబలితో పోలుస్తూ చాలా కామెంట్లు వచ్చాయి. విజువల్స్ కొన్ని బాహుబలి సినిమాతో దగ్గరగా ఉండడంతో బాహుబలి లాంటి ప్రయోగం ఏమైనా చేస్తున్నారేమో అని అనుమానాలు కూడా వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ప్రమోషన్స్ లో సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో సినిమా మీద ప్రేక్షకులలో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా చూస్తే ఆ అంచనాలను అందుకునే విధంగానే కనిపించింది. మొదటి భాగం మొదలైనప్పటినుంచి సినిమాలో ప్రేక్షకులను లీనమయ్యే విధంగా చేయడంలో దర్శకుడు అలాగే మిగిలిన టీం సఫలం అయింది అని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ లాజిక్ మిస్ కాకుండా తాను చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి దర్శకుడు వశిష్ట చాలా కష్టపడ్డాడు. అందులో దాదాపు సఫలమయ్యాడు. అహంభావంతో మదగజం లాంటి వ్యక్తిత్వంతో కనిపించిన రాజ్యాన్ని కబళిస్తూ వెళ్లిన బింబిసారుడు ఒక చిన్న కుగ్రామం మీద దండెత్తి ఆ గ్రామస్తుల శాపానికి ఎలా గురయ్యాడు? గురైన తర్వాత అతని పరిస్థితి ఏమిటి? నిజంగానే మంచి మనుషుల శాపాలు ఫలిస్తాయి లాంటి విషయాలను చూపించి ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించారు. రాజులు, రాచరికపు కథలు తెలుగు సినిమాకి కొత్త కాకపోయినా ఈ సినిమాను కాస్త విభిన్నంగా ప్రజెంట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించి దాదాపు సఫలమయ్యాడు. సినిమా ఆద్యంతం కూడా ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా సాగుతుంది చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా, ప్రేక్షకులు సినిమా మీద కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు.
నటీనటుల పెర్ఫార్మెన్స్:
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ వింబిసారుడు అనే పాత్రలో పూర్తిస్థాయిలో లీనమయ్యాడు. ఒక రకంగా ఆ పాత్రలో కళ్యాణ్ రామ్ తప్ప ఇంకెవరూ నటించలేరేమో అనే విధంగా తన నటన విశ్వరూపాన్ని చూపించాడు. సాధారణంగా నందమూరి హీరోలు అనగానే నటనకు కేరాఫ్ అడ్రస్ గా చెబుతూ ఉంటారు. కళ్యాణ్ రామ్ ఇప్పటికే పలు సినిమాలతో సత్తా చాటాడు కానీ ఈ సినిమా తర్వాత బింబిసార ముందు బింబిసార తర్వాత అనేంతలా తన పాత్రలో ఒదిగిపోయాడు. కళ్ళతో కూడా కొన్ని హావభావాలు పలికించి కళ్యాణ్ రామ్, తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ సినిమా పూర్తిస్థాయిలో కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. హీరోయిన్ల పాత్ర పరిధి మీద చాలా తక్కువగా ఉంటుంది. ఐరా పాత్రలో కనిపించిన కేథరిన్ థెరిసా కొన్ని సీన్లలో ఆకట్టుకుంటుంది. సంయుక్త మీనన్ కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. వరీనా హుస్సేన్ ఒక సాంగ్ లో మాత్రమే కనిపించి అందాలు ఆరబోసింది. ఇక ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అయ్యప్ప శర్మ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కొన్ని సీన్లు కామెడీ పరంగా ఆకట్టుకుంటాయి.
టెక్నికల్ పెర్ఫార్మెన్స్:
టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు గురించే. అనేక సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ఆయన అనుభవం మొత్తం కూడా ఈ సినిమా స్క్రీన్ మీద ఖచ్చితంగా కనబడుతుంది. బాహుబలి లాంటి సినిమాలతో పోలిస్తే తక్కువ బడ్జెట్ అయినా ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా తీర్చిదిద్దారు. అలాగే వీఎఫ్ఎక్స్ టీం కూడా సినిమా గ్రాండియర్ ని మరింత పెంచడానికి చాలా కష్టపడిందని చెప్పవచ్చు. బడ్జెట్ విషయాలు పక్కన పెడితే సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలవడానికి దర్శకుడు పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. అలాగే సంగీతం అందించిన చిరంతన్ బట్, నేపథ్య సంగీతం అందించిన కీరవాణి కూడా సత్తా చాటారు. సినిమాకు నేపద్య సంగీతం సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ షాట్స్, స్టంట్స్ కళ్యాణ్ రామ్ నటన అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి. సినిమాకు ఇవే ప్రాణం అని చెప్పొచ్చు.
ఫైనల్ గా
ఫైనల్ గా సినిమా గురించి చెప్పాల్సి వస్తే నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత మరో హిట్టు అందుకునే అవకాశం కనిపిస్తుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పొరపాట్లు పక్కన పెడితే కచ్చితంగా ధియేటర్లలో చూడదగిన సినిమా బింబిసార.
నటీనటుల : నందమూరి కళ్యాణ్ రామ్,కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి.
నిర్మాణం : హరి కృష్ణ.కె
రచన & దర్శకత్వం : వశిష్ట
డిఓపి : చోటా కె నాయుడు
సంగీత దర్శకుడు : ఎంఎం కీరవాణి
ఎడిటర్ : తమ్మి రాజు
విఎఫ్ఎక్స్ నిర్మాత : అనిల్ పాదూరి
పాటలు : చిరంతన్ భట్
ఆర్ట్ : కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్ : వెంకట్ & రామ్ క్రిషన్
డైలాగ్స్ : వాసుదేవ్ మునెప్పగారి
Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్ ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook