శ్రీదేవి మృతి అనంతరం చట్టరీత్యా జరుగుతున్న ప్రాథమిక దర్యాప్తు, శవపరీక్ష, ప్రక్రియలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. దుబాయ్‌లో వున్న భారత రాయబార కార్యాలయం అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం శ్రీదేవి భౌతికకాయాన్ని బోనీకపూర్ కుటుంబసభ్యులకి అప్పగించేందుకు ఇక మిగిలి వున్న ప్రక్రియ ఎంబాల్మింగ్ ఒక్కటేనని సమాచారం అందుతోంది. దుబాయ్‌లో అమలులో వున్న చట్టాల ప్రకారం సాధారణంగా ఎంబాల్మింగ్ ప్రక్రియ అనేది నిత్యం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే నిర్వహిస్తారు. ఏదైనా అత్యంత అరుదైన పరిస్థితులలో అత్యవసరంగా ఎంబాల్మింగ్ చేయాల్సి వస్తే, అప్పుడు ప్రత్యేక అనుమతులతో ఏ సమయంలోనైనా ఎంబాల్మింగ్ చేసే అధికారం వైద్య ఆరోగ్య శాఖకు వుంటుంది. శ్రీదేవి భౌతికకాయం అప్పగింతకు జాప్యం అవడానికి ఈ ఎంబాల్మింగ్ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న జాప్యం కూడా ఓ ప్రధాన కారణంగా దుబాయ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. 


శ్రీదేవి భౌతికకాయానికి ఆ ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం చట్టబద్ధంగా అక్కడి భారత రాయబార కార్యాలయ సిబ్బంది సమక్షంలో ఆమె భౌతికకాయాన్ని బోనీకపూర్‌కి అప్పగిస్తారు. అయితే, అందుకు ఇంకా ఎంత సమయం పడుతుందనేదానిపై సరైన స్పష్టత లేదు. ఇదంతా ఇలా వుంటే, మరోవైపు ముంబైలో శ్రీదేవి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు ఆమె అభిమానులు, సన్నిహితమిత్రులు, బంధువులు, కుటుంబస్నేహితులు భారీ సంఖ్యలో అనిల్ కపూర్ నివాసం వద్ద భారీ సంఖ్యలో గుమికూడి వున్నారు.