Che Movie Release Date: “9వ త‌ర‌గ‌తిలోనే ప్ర‌పంచ విప్ల‌వానికి ఐకాన్‌గా నిలిచే చేగువేరా గురించి తెలుసుకున్నాను. అప్ప‌టి నుంచి ఒక‌టే క‌ల. ఆయ‌న బ‌యోపిక్ సినిమాగా తీయాల‌ని. డ‌బ్బులు లేవు, స‌పోర్టు లేదు. తోపుడు బండిపై చిన్నచిన్న తినుబండారాలు అమ్ముతూ పైసా పైసా కూడ‌బెట్టాను. నా అణువ‌ణువూ చేగువేరా. ల‌క్ష్యం, సంక‌ల్పం ఒక్క‌టే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు చేగువేరాను మ‌ధ్య‌మ‌ధ్య‌లో నాకు ప‌రోక్షంగా గుర్తు చేస్తున్న స‌మ‌యంలో నా లక్ష్యం మ‌రింతా బ‌ల‌ప‌డింది. 20 ఏళ్ల శ్ర‌మ ఫ‌లించింది. ఆయ‌న గౌర‌వం ఏమాత్రం త‌గ్గకుండా చేగువేరా బ‌యోపిక్ “చే” సినిమాను తీశాను. సినిమా ప్ర‌చార చిత్రాల‌ను చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా స్వ‌యంగా విడుద‌ల చేసి మా చిత్ర‌యూనిట్‌ను మ‌మ్మ‌ల్ని అభినందించడం మాకెంతో గ‌ర్వ‌కార‌ణం. సెన్సార్ వాళ్లు కూడా సినిమా చూసి ఇంప్రెస్ అయ్యారు. డిసెంబర్ 15న థియేట‌ర్‌ల‌లోకి చేగువేరా బ‌యోపిక్ “చే”ను విడుద‌ల చేస్తున్నాం..” అని తెలిపారు రచయిత, దర్శకుడు బీఆర్ సభావత్ నాయక్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం “చే” - లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. డిసెంబ‌ర్ 15న ఈ సినిమా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు దర్శకుడు బీఆర్ సభావత్ నాయక్ చేగువేరా లుక్‌లో రావ‌డం అంద‌రిని ఆక‌ర్షించింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న అతిథులు ఈ సినిమా గురించి మాట్లాడారు.


జనసేన నాయకురాలు రాయపాటి అరుణ మాట్లాడుతూ.. "చేగువేరా బయోపిక్‌ను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సపోర్ట్ చేస్తారు. యువత ఇలాంటి సినిమాలను చూడాలి. చేగువేరా స్పూర్తితో, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి మాదిరిగా సామాన్యుల హక్కుల కోసం మ‌న‌మంతా పోరాటం చేయాలి. పెద్ద సినిమానా? చిన్న సినిమా అని చూడకుండా వ్య‌వ‌స్థ కోసం చూడాలి. ఎంట‌ర్‌టైన్మెంట్ కోసం కాకుండా స‌మాజం కోసం చూడాలి. ఈ సినిమాకు మా స‌పోర్టు ఉంటుంది." అని అన్నారు.


సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్రభు మాట్లాడుతూ.. "ఒక‌ చిన్న స్థాయి వ్యక్తి ఒక బ‌ల‌మైన కంటెంట్‌తో ఇలా మ‌న ముందుకు రావ‌డం నిజంగా గ్రేట్! ద‌ర్శ‌కుడు బీఆర్ సభావత్ నాయక్ ఫ‌స్ట్ టైం చూశాక‌ సామాన్యుడు అనుకున్నాను. ట్రైలర్ చూశాక షాక్ అయ్యాను. కంటెంట్‌ను ఎంతో బలంగా చూపించారు. విప్లవలకు ఐకాన్ చేగువేరా ఆశ‌యాల‌ను పవన్ క‌ళ్యాణ్ గారు యువత ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. ఇండియాలోనే తొలిసారిగా “చే” సినిమా తీసిన సభావత్ నాయక్‌ను అభినందిస్తున్నాను. ఆర్ఆర్ మ్యూజిక్ అద్భుతం. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు భారీ హిట్ చేస్తారు." అని అన్నారు.


మరో సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ మాట్లాడుతూ.. "సరిహద్దులు లేని ప్రపంచంలో ప్రతి మనిషి కోసం స్ఫూర్తిగా నిలిచిన చేగువేరా బ‌యోఫిక్ తెలుగులో సినిమాగా రావ‌డం సంతోషంగా ఉంది. దర్శకుడు బీఆర్ సభావత్ నాయక్ తను తెర‌కెక్కించాల‌నుకున్న ఓ బ‌ల‌మైన కంటెంట్‌ను అంతే బలంగా, నిజాయితీగా చూపించాడ‌ని అనిపిస్తుంది. ట్రైల‌ర్ చూస్తేనే ఆయ‌న ప‌డ్డ శ్ర‌మ‌ అర్థ‌మ‌వుతుంది. ఆయ‌న‌ను అభినందిస్తున్నాను" అన్నారు.


“ఇలాంటి బయోగ్రఫీ తీసుకురావడం అభినంద‌నీయం. ఒక పోరాట‌యోధుడిని ఆవిష్క‌రించిన సభావత్ నాయక్‌ గారి ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం ఈ సినిమా. ఈ సినిమాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి.” అని 'ప్రత్యర్థి' మూవీ డైరెక్టర్ శంకర్ అన్నారు.


నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించిన‌ ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషించారు. రవిశంకర్ సంగీతం అందించారు. సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా వీరాంజనేయ పిక్చర్స్ సంస్థ ద్వారా 100 కు పైగా థియేటర్లలో విడుదలకు సిద్ధ‌మైంది.