ఎన్టీఆర్ బయోపిక్ కోసం రంగంలోకి దిగిన మరో దర్శకుడు
ఎన్టీఆర్ బయోపిక్‌లో విఠలాచార్య పాత్రలో దర్శకుడు ఎన్ శంకర్
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మొత్తం స్టార్స్‌తో నిండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను తెరకెక్కించడంలో ఎంతో మంది పాత తరం, నేటి తరం నటీనటులు, దర్శకులు తమ వంతు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ కూడా వచ్చి చేరాడు. అలనాటి మేటి దర్శకుడు విఠలాచార్య పాత్ర కోసం తాజాగా మేకర్స్ దర్శకుడు ఎన్ శంకర్‌ని ఆశ్రయించగా.. అందుకు సరేనన్న సదరు దర్శకుడు విఠలాచార్య పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకు కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ మాత్రమే కాకుండా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న క్రిష్ సైతం ఈ సినిమాలో ఓ పాత్ర పోషిస్తున్నాడు.
ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి, అలనాటి మహానటి సావిత్రి పాత్రలో నిత్యామీనన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న బాలయ్య బాబు మొదటిసారి ఈ సినిమాను నిర్మించడం కోసం నిర్మాతగా మారారు.