రాజశేఖర్‌ హీరో నటించిన ‘పీఎస్వీ గరుడ వేగ’ చిత్రాన్నిప్రదర్శించవద్దని సిటీ సివిల్‌ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీవీల్లో, యూట్యుబ్, ఇతరత్రా చోట్ల ప్రదర్శించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. సినిమా ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు నిర్వహించరాదంటూ నిర్మాతలు, దర్శకుడితోపాటు యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'పీఎస్వీ గరుడ వేగ' సినిమా తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని, దీని ప్రదర్శనలను నిలిపివేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ యురేనియం కార్పొరేషన్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై సిటీ సివిల్‌ కోర్టు విచారణ చేపట్టింది. మొత్తం సినిమా యురేనియం కార్పొరేషన్‌లో జరిగిన స్కాం గురించి ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.


పిటీషన్లో తమ సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లిలో ఉందని.. యురేనియం స్కాంలో  తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించి కించపరిచారని పేర్కొన్నారు. ఈ స్కాంను ఎన్‌ఐఏ అసిస్టెంట్‌ కమిషనర్‌గా హీరో వెలుగులోకి తీసుకొచ్చినట్లు చూపారన్నారు. అందువల్ల సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. జడ్జి పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించి తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.