Rama Banam Movie Review: గోపీ చంద్ `రామబాణం` రివ్యూ-రేటింగ్.. లక్ష్యాన్ని చేధించిందా?
Rama Banam Movie Review: రామబాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మ్యాచో స్టార్ గోపీచంద్. ఆ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంది అనేది ఈరోజు రివ్యూలో చూద్దాం.
Gopichand Rama Banam Movie Review: సీటీమార్ వంటి మాస్ సబ్జెక్ట్ తర్వాత రామబాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మ్యాచో స్టార్ గోపీచంద్. సమ్మర్ స్పెషల్ మూవీగా ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లౌక్యం, లక్ష్యం లాంటి సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టిన శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాల పెంచేశాయి. అలాంటి సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంది అనేది ఈరోజు రివ్యూలో చూద్దాం.
రామాయణం కథ విషయానికి వస్తే
రాజారాం(జగపతిబాబు) ఆదర్శాలతో జీవిస్తూ ఉంటాడు. తప్పు చేయకూడదు చేస్తే చట్టమే దండించాలి అంతేకానీ చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదు అని భావిస్తూ ఉంటాడు. సుఖీభవ పేరుతో ఆర్గానిక్ పద్ధతిలో తయారుచేసిన కూరగాయలు, సామాన్లతోనే వంటలు వండి తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తూ ఉంటాడు. అయితే పోటీదారుడైన పాపారావు(నాజర్)తో జరిగిన ఒక వివాదం వల్ల రాజారాం సోదరుడు విక్కి(గోపీచంద్) చిన్నతనంలోనే ఇల్లు వదిలి పారిపోతాడు. ఇల్లు వదిలి కలకత్తా వెళ్లి ఒక పెద్ద డాన్ గా ఎదుగుతాడు. ఒక అమ్మాయి(డింపుల్ హయతి)ని ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్న సమయంలో అమ్మాయి తరఫు వాళ్ళు కుటుంబం ఉంటేనే పెళ్లి చేస్తామని చెప్పడంతో తిరిగి తన అన్న కుటుంబం దగ్గరకు వస్తాడు. అయితే మొదట్లో అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా అన్న జీకే(తరుణ్ అరోరా), పాపారావు వల్ల ఇబ్బందులు పడుతున్నాడు అనే విషయం తెలుసుకుంటాడు. తాను డాన్గా మారిన విషయం అన్నకి తెలియకుండానే వారి భరతం పట్టే ప్రయత్నం చేస్తాడు. చివరికి విక్కీ జీకే బారి నుంచి తన అన్న రాజారామ్ కుటుంబాన్ని కాపాడుకున్నాడా? విక్కీ డాన్ గా ఎదిగిన సంగతి తెలుసుకున్న రాజారాం ఏం చేశాడు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా గురించి లోతుగా విశ్లేషించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సినిమా చూడడం మొదలుపెట్టినప్పటి నుంచే సినిమాని ఇంతకుముందే ఎక్కడో చూసామే అని అనిపిస్తూ ఉంటుంది. నిజానికి పాత కథలని కూడా కొత్తగా ప్రేక్షకులు అచ్చెరువొందేలా చెబుతున్న ఈ రోజుల్లో రొటీన్ కథను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సేంద్రియ ఉత్పత్తులు, సంప్రదాయ ఆహారం, ఆహార కల్తీ వంటి అంశాలతో ఇప్పటికే అనేక సినిమాలు తెరమీదకు వచ్చాయి. కానీ దాన్ని ఒక సినిమాగా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సినిమా యూనిట్ తడబడింది. సినిమాకి కావలసినంత స్టార్ క్యాస్ట్, బడ్జెట్ ఉందని సినిమా చూస్తే అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంచి మంచి టెక్నీషియన్స్ ని కూడా సినిమా కోసం పని చేయించారు. కానీ సినిమాగా మలిచిన విధానం మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. సినిమా ఓపెనింగ్ సీన్ మొదలు క్లైమాక్స్ సీన్ వరకు ఏ ఒక్క సీన్ లోను కొత్తదనం లేదు. ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా అలాగే సస్పెన్స్ కలిగించే విషయాలు ఉన్నా సరే ఎందుకో సినిమా చూస్తున్నంత సేపు సాదాసీదాగా సినిమాటిక్ గా సాగిపోతుంది తప్ప ఎక్కడా రియల్ ఎస్టేట్ వచ్చి మాత్రం కనిపించలేదు. సాధారణంగా గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈ సినిమాలో కామెడీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒక డాన్ గా సెటిల్ అయిన హీరో తిరిగి తన కుటుంబాన్ని కలవడం కోసం బయల్దేరడంతో మొదలైన సినిమా కథ, హీరో ఫ్లాష్ బ్యాక్ కలకత్తాలో ఎదిగిన తీరు వంటివి చూపిస్తారు. తర్వాత యూట్యూబర్ ప్రేమలో పడటం ఆ తర్వాత జరుగుతున్న సన్నివేశాలు వంటివి ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. రియాలిటీకి చాలా దూరంగా చాలా సీన్స్ ఉంటాయి, లాజిక్ కి అందకుండా సినిమా తెరకెక్కించారని చెప్పక తప్పదు. అయితే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటాయి. అలాగే సేంద్రియ ఆహార ఉత్పత్తుల గురించి హీరో మాట్లాడిన డైలాగ్స్, విలన్ తో హీరో చెప్పే కొన్ని మాస్ డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
నటీనటులు:
సినిమా నటీనటుల విషయానికొస్తే గోపీచంద్ ఎప్పటిలాగే స్టైలిష్ గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ లో పాటల్లో తనదైన ఈజ్ తో నటించారు. అయితే ఆయన పాత్ర మలిచిన తీరులో ఏ మాత్రం కొత్తదనం కనిపించలేదు. అయితే జగపతిబాబు మాత్రం ఈ సినిమాలో పూర్తిస్థాయి పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపించారు. తమ్ముడి కోసం వైలెంట్ గా మారే క్యారెక్టర్ లో జగపతిబాబు మెప్పించాడు. డింపుల్ హయాతి పాటల్లో అందాలు ఆరబోయడానికే పరిమితం అయింది. కుష్బూ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. అలీ, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శీను, సప్తగిరి వంటి వాళ్ళు ఉన్నా కామెడీ ఏ మాత్రం వర్కౌర్ అవలేదు, కొన్నిచోట్ల ఎబ్బెట్టుగా అనిపించింది. విలన్ పాత్రలు హీరోయిజం ఎలివేట్ చేయడంలో ఏమాత్రం సహాయ పడలేదు
టెక్నీషియన్స్:
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే సినిమా దర్శకుడిగా శ్రీవాస్ పూర్తిస్థాయిలో సినిమాని ఎలివేట్ చేయలేకపోయారేమో అనిపించింది. సినిమా కథ వరకు బాగానే ఉన్నా దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో తడబడినట్లు అనిపిస్తుంది. భూపతిరాజా కథ ఓకే కానీ స్క్రీన్ ప్లేతో దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసే ప్రయత్నం చేయవచ్చు. కానీ ప్రేక్షకులకు సినిమా చూసిన వెంటనే రొటీన్ సినిమానేమో అనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత కథ అయినా మరింత రొటీన్ గా చెప్పడంతో తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనేది బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చాలి. ఇక నిర్మాణ విలువలు సినిమా నిర్మాణ సంస్థ స్థాయికి తగ్గట్టుగానే రిచ్ గా ఉన్నాయి.
ఫైనల్ గా
ఒక్కమాటలో చెప్పాలంటే లక్ష్యాన్ని చేదించలేకపోయిన గోపీచంద్ -శ్రీ వాస్ ల రామబాణం
Rating: 2/5
Also Read: Ramabanam : రామబాణం థియేటర్ కౌంట్.. బ్రేక్ ఈవెన్ ఎంత, బిజినెస్ ఎంత జరిగిందంటే?