కమల్‌కి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన హాలీవుడ్ ఫిలింమేకర్
ఇండియన్ ఫిలిం స్టార్ కమల్ హాసన్‌కి హాలీవుడ్‌లో ఎంతో పేరు ప్రఖ్యాతలు వున్న ఫిలింమేకర్ క్రిస్టోఫర్ నోలన్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
ఇండియన్ ఫిలిం స్టార్ కమల్ హాసన్‌కి హాలీవుడ్‌లో ఎంతో పేరు ప్రఖ్యాతలు వున్న ఫిలింమేకర్ క్రిస్టోఫర్ నోలన్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ముంబైలో మార్చి 30న ప్రారంభమైన '' రిఫ్రేమింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫిలిం'' పేరిట జరిగిన ఓ ఫిలిం ఈవెంట్‌కి అతిథిగా హాజరైన క్రిస్టోఫర్ నోలన్ అక్కడ అనుకోకుండా కమల్ హాసన్‌ని కలిశాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్ నటించిన పాపనాశం సినిమాను తాను చూసినట్టు చెప్పి కమల్‌కి షాకిచ్చాడు క్రిస్టోఫర్ నోలన్. 2013లో మళయాళంలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సినిమాకు తమిళ రీమేక్ వెర్షనే ఈ పాపనాశం సినిమా. 2015లో తమిళంలో రిలీజైన ఈ సినిమాను కూడా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయగా ఆ తర్వాత ఇదే సినిమా మళ్లీ తెలుగులో వెంకీ, మీనా జంటగా దృశ్యం పేరిట రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను పరిచయం చేయడం సంగతి పక్కనపెడితే, తన సినిమాను చూశానని క్రిస్టోఫర్ లాంటి హాలీవుడ్ ఫిలింమేకర్ చెప్పడం కమల్‌కి ఆశ్చర్యం కలిగించిందట. ఇదే విషయాన్ని కమల్ ట్విటర్ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
తాను కూడా క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'డన్‌కిర్క్' సినిమాను డిజిటల్ వెర్షన్‌లో చూశానని, అందుకు ఆయనకు క్షమాపణలు చెప్పుకున్నట్టు కమల్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా అందుకు బదులుగా తాను నటించిన హేరామ్ సినిమా డిజిటల్ వెర్షన్‌ని క్రిస్టోఫర్ నోలన్‌కి పంపించినట్టు కమల్ తెలిపాడు.
ముంబైలో మూడు రోజులపాటు జరగనున్న ఈ ఫిలిం ఈవెంట్‌కి ఇంకొంతమంది హాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.