నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటారు ఆయన. ఇంకా ఎక్కువగా మాట్లాడితే నవ్వలేనివాడు బ్రతకడమే వ్యర్థం అంటారు. ప్రేక్షకులను నవ్వించడమే తన జీవిత ధ్యేయంగా తెలుగు నాట లెక్కలేనన్ని హాస్యచిత్రాలకు దర్శకత్వం వహించిన మేటి రచయిత 'జంధ్యాల' అనడంలో సందేహం లేదు. ఈ రోజు జంధ్యాల జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*1951 జనవరి 14 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన జంధ్యాల బికామ్ వరకూ చదువుకున్నా నాటకాలంటే పడిచచ్చేవారు. నాటకాల్లో నటించడం కన్నా.. వాటిని రాయడంపై ఎక్కువ ప్రేమ చూపించేవారు. ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును లాంటి నాటకాలు ఆయన హాస్యసృజనకు ప్రతీకలు. ఆయన అసలు పేరు జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి.


*'ముద్ద మందారం' జంధ్యాల దర్శకత్వం వహించిన తొలి చిత్రం. అయితే తాను దర్శకత్వం వహించని పలు చిత్రాలకు కూడా ఆయన మాటలు, కథా సహకారం అందించారు. అలాగని..ఆయన అన్నీ హాస్యప్రధానమైన సినిమాలే తీయలేదు. అప్పడప్పుడు సెంటిమెంట్, లవ్ సబ్జెక్టులను కూడా టచ్ చేశారు.


*శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు మొదలైన సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు జంధ్యాలే మాటలు రాయడం విశేషం. 1976లో దేవుడు చేసిన బొమ్మలు చిత్రంతో మాటల రచయితగా కెరీర్ మొదలుపెట్టిన జంధ్యాల ఆ తర్వాత నెమ్మదిగా మెగాఫోన్ కూడా పట్టారు.


*రెండు జెళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, అహనా పెళ్లంట, వివాహ భోజనంబు, చూపులు కలసిన శుభవేళ, ప్రేమ ఎంత మధురం మొదలైనవి జంధ్యాల దర్శకత్వం వహించిన పలు హాస్యరస ప్రధాన చిత్రాలు.


*ఈ చిత్రాలే కాక పూర్తిస్థాయి సంగీత, నృత్య ప్రధాన చిత్రమైన 'ఆనందభైరవి'కి కూడా ఆయన దర్శకత్వం వహించారు. అలాగే అమెరికాకి వెళ్లి ప్రవాస భారతీయుల సంప్రదాయలను సమీక్షించి 'పడమటి సంధ్యారాగం' కూడా తీశారు. అలాగే చంటబ్బాయ్ లాంటి డిటెక్టివ్ సినిమాను, సత్యాగ్రహం వంటి విప్లవాత్మకమైన చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసిన ఘనత జంధ్యాలది.


*తెలుగు చలనచిత్ర పరిశ్రమకు బ్రహ్మానందం, నరేష్, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు వంటి హాస్య నటులను పరిచయం చేసిన ఘనత జంధ్యాలది.


*తన కెరీర్‌లో నాలుగు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న జంధ్యాల భారతప్రభుత్వం నుండి 'పద్మశ్రీ' పురస్కారం కూడా అందుకున్నారు.


*అలాగే 'పుణ్యభూమి కళ్లు తెరు' అనే సినిమాకు పాటలకు కూడా రాశారు జంధ్యాల. 


*జంధ్యాల దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం "విచిత్రం". 1998లో విడుదలైన ఈ చిత్రంలో గజల్ శ్రీనివాస్ హీరోగా నటించారు. 


*19 జూన్ 2001 తేదిన అనారోగ్యకారణాల వల్ల తన సొంతఇంటిలో మరణించారు జంధ్యాల. అయినా హాస్యచక్రవర్తిగా ఆయన పేరు తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా ఉండిపోతుందని చెప్పవచ్చు.