Amigos Movie Review: కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Amigos Telugu Review: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
Kalyan Ram Amigos Review: బింబిసార లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం అమిగోస్. బింబిసార లాంటి సినిమాతో హిట్టా అందుకున్న తర్వాత కళ్యాణ్ రామ్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అమిగోస్ అనే సినిమా ప్రకటించారు. కొత్త దర్శకుడు రాజేంద్రనాథ్ రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే పోలికతో ఉన్న ముగ్గురు వ్యక్తుల మధ్య సాగే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూలో చూద్దాం.
అమిగోస్ కథ:
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసం ఉండి తండ్రి వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు సిద్ధార్థ్(కళ్యాణ్ రామ్ 1). తల్లిదండ్రులు పెళ్లికి తొందర పెడుతున్నా తన మనసుకు నచ్చే అమ్మాయి దొరికే వరకు చేసుకోనని భీష్మించుకుని కూర్చుంటాడు. అలాంటి అతను మొదటి చూపులోనే ఇషిక(ఆషిక)ను ప్రేమిస్తాడు. ఆమెను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తనలాగే ఉన్న డాపుల్ గ్యాంగర్స్ ను కలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా కలకత్తాకు చెందిన మైకేల్(కళ్యాణ్ రాం 2), బెంగళూరుకు చెందిన మంజునాథ హెగ్డే(కళ్యాణ్ రామ్ 3) పరిచయమవుతారు.
తనలాగే ఉన్న వారిద్దరిని గోవాలో కలిసి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వారిద్దరిని హైదరాబాద్ తీసుకువస్తాడు సిద్ధార్థ. అయితే విడిపోవాల్సిన సమయం వచ్చిన సమయంలో మైఖేల్ అసలు పేరు వేరే ఉందని అతను ఎన్ఐఏ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలుస్తుంది. అయితే అతను తెలివిగా మంజుని తన స్థానంలో పోలీసులకు చిక్కేలా చేస్తాడు. తర్వాత సిద్ధార్థ ఐడెంటిటీ వాడుకొని విదేశాలకు పారిపోవాలని ప్రయత్నిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ ఏం చేశాడు? మైఖేల్ కబంధహస్తాల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా కథ.
విశ్లేషణ:
ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా యూనిట్ అంతా తెలుగు సినీ చరిత్రలో మునుపెన్నడు లేని పాయింట్తో సినిమా చేస్తున్నామని ఊరిస్తూ వచ్చింది. ఎలాంటి సంబంధం లేకుండా ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తులు కలిస్తే, వారి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. సాధారణంగా ఒకే పోలికలతో ఇద్దరు వ్యక్తులు ఉంటే వారిని డాపుల్ గ్యాంగర్స్ అంటారు. అంటే కవలలు కాకుండా వీరు ఒకరికి ఒకరు సంబంధం లేకపోయినా ఒకే పోలికలతో ఉంటారు. అలాంటి వారిని కనుక్కోవడానికి ఒక వెబ్సైట్ ఉంటే దాని ద్వారా తన లాగే ఉన్న వేరే వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి కథగా ఈ సినిమా తెరకెక్కించారు.
అమిగోస్ గురించి మంచి విషయం ఏమిటంటే గందరగోళం లేకపోవడం, ప్రధాన పాత్ర సిద్దార్థ్ కోణంలో సినిమాను నేరేట్ చేశారు, ప్రథమార్థం అంతా అతని ప్రేమకథే నడుస్తుంది. డోపెల్‌గాంగర్‌ల విషయం కూడా స్పష్టమైన కథనంతో చేప్పేశారు.ఇక సినిమాలో తరువాత ఏమి జరగనుంది అనేది మనం ముందే ఊహిస్తాం. సెకండాఫ్‌లో మైఖేల్ పాత్ర బ్యాక్ గ్రౌండ్, అతని ఉద్దేశ్యం వెల్లడయినప్పుడు అసలు కథ అర్ధమైపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ భాగం లవ్‌ట్రాక్, ఎంటర్‌టైన్‌మెంట్ తో నడిపిస్తే సెకండాఫ్‌లో డ్రామా, యాక్షన్ ఉంటుంది. సినిమా కథనం స్క్రీన్‌పై అవసరమైన ఉత్సాహాన్ని తీసుకురావడంలో విఫలమైంది. సినిమా యూనిట్ ప్రచారం చేసుకున్నంత కాకపోయినా ఈ పాయింట్ కాస్త కొత్తగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడితే ఇంకా బాగుండేది.
నటీనటులు
నటీనటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద మూడు పాత్రలతో నడిపించాడు కళ్యాణ్ రామ్. ఒకటి పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాగా మరొకటి పూర్తి అమాయక చక్రవర్తి లాంటి మంజు పాత్ర, ఈ రెండు భిన్నమైన పాత్రల్లో తనదైన శైలిలో నటించాడు కళ్యాణ్ రామ్. ఇక మరొక పాత్ర పక్కింటి కుర్రాడు పాత్రలాగే చాలా సరదాగా సాగిపోతూ ఉంటుంది. సాధారణంగా రెండు పాత్రలు పోషించడమే కష్టమైన విషయం అనుకుంటే మూడు పాత్రలు పోషించి ఏ ఒక్క పాత్రకి పోలిక పెట్టకుండా కళ్యాణ్ రామ్ పడ్డ తపన స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ తండ్రి పాత్రలో జయప్రకాష్ తన పరిధి మేర నటించాడు. సిద్ధార్థ మేనమామ పాత్రలో నటించిన బ్రహ్మాజీ ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన భామ ఆషిక రంగనాథ్ కి మాత్రం పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కలేదు. అయితే ఉన్నంతసేపు కళ్ళు తిప్పుకోకుండా ఆమెనే చూసేంత అందంగా కనిపించింది. ఇక మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే
సినిమాకి సంగీతం బాగా కుదిరింది, గిబ్రాన్ సంగీతం సినిమాకి ప్లస్ అయింది. బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ప్లేస్మెంట్ బాగా కుదిరింది. సినిమాకి ఒక కమర్షియల్ లుక్ తీసుకొచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్నిచోట్ల బాగుంది. ఇక సౌందరరాజన్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగినట్లుగా సరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు ఎడిటింగ్ టేబుల్ మీద గట్టిగా పని చేసినట్టున్నారు, ఎక్కడా బోర్ కొట్టకుండా అనవసరమైన సీన్లు లేకుండా కుండ బద్దలు కొట్టినట్లుగా సినిమాని నేరేట్ చేశారు. డైలాగ్స్ కూడా అతిగా లేకుండా అర్ధవంతంగా ఉన్నాయి.
ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే
కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన మరో ప్రయోగం ఈ అమిగోస్, అద్భుతం అని అనలేము కానీ కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా ఒక సారి హ్యాపీగా చూసేయచ్చు. అసభ్యత కూడా లేదు కాబట్టి ఫ్యామిలీలతో కలిసి చూడదగిన సినిమా ఇది.
Rating: 2.75/5
Also Read: Aha Video Crashed: అనుకున్నంతా అయింది.. పవన్ దెబ్బకు 'ఆహా' అనిపించారు!
Also Read: Taraka Ratna Health Update: తారకరత్న హెల్త్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడెలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook