KCR Praises Allu Arjun For Winning Best Actor Award at National Film Awards: ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల్లో భాగంగా 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. విలక్షణమైన రీతిలో తమ అత్యుత్తమ నటనద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలియజేశారు. 69 ఏండ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తమ నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర కళాకారుడు కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు. నాటితరం గొప్ప నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా, విలక్షణ నటులైన చిరంజీవి వంటి వారి స్ఫూర్తితో నేటితరం నటుడిగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని సిఎం కితాబిచ్చారు.


అదే సమయంలో తమ సృజనాత్మక రచనతో సినీ పాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు, ఉత్తమ సినీ సాహిత్యానికి గాను జాతీయ అవార్డు దక్కడం పట్ల సిఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబోస్ కు శుభాకాంక్షలు చెబుతూ అభినందించారు. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి సిఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.


ఇది కూడా చదవండి : Pushpa 2 Release Date: పుష్ప 2 సినిమా విడుదల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటే


తెలుగు చలన చిత్ర రంగం నేడు హైద్రాబాద్ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతుండడం గొప్ప విషయమని సిఎం అన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతూ, ఫిల్మ్ ప్రొడక్షన్ లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వ కారణమని సిఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలుగు సినిమా ఇతర భారతీయ సినిమా రంగాలతో పోటీపడుతుండడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే వుంటుందని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని సిఎం ఆకాంక్షించారు. ఐతే జాతీయ అవార్డుగ్రహీతలను అభినందించే క్రమంలో పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావించిన తెలంగాణ సీఎంఓ.. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి అవార్డు సొంతం చేసుకున్న ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి పేరు ప్రస్తావించలేదు అని కొంతమంది నెటిజెన్స్ హైలైట్ చేయడం సోషల్ మీడియాలో కనిపించింది.


ఇది కూడా చదవండి : Jailer Movie Total Collections: జైలర్ మూవీ టోటల్ కలెక్షన్స్ అదుర్స్.. జైలర్ ఖాతాలో మరో రికార్డ్