నర్తనశాల స్పెషల్ స్క్రీనింగ్... వారికి మాత్రమే ప్రత్యేకం!
నర్తనశాల స్పెషల్ స్క్రీనింగ్
నాగశౌర్య ప్రధాన పాత్రలో రేపు ఆడియెన్స్ ముందుకు రానున్న నర్తనశాల సినిమా అనుకోకుండా వివాదంలో పడింది. ఈ సినిమాలో హిజ్రాలను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ భారీ సంఖ్యలో హిజ్రాలు ఫిలిం ఛాంబర్ ఎదుట ఇవాళ మధ్యాహ్నం నిరసన ప్రదర్శన చేపట్టారు. నర్తనశాల సినిమా విడుదల నిలిపేయాల్సిందిగా ఈ సందర్భంగా హిజ్రాలు డిమాండ్ చేశారు. అయితే, అదే సమయంలో అక్కడే ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీ రాజా వారితో మాట్లాడి సినిమాలో ట్రాన్స్‌జండర్స్ మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు ఏవీ లేవని చెప్పారు. అంతేకాకుండా వారి కోసం ప్రత్యేకంగా ఓ షోను ఏర్పాటు చేస్తామని చెప్పిన శివాజీ రాజా.. ఒకవేళ అందులో ట్రాన్స్‌జండర్స్‌ని కించపరిచేలా ఏమైనా సన్నివేశాలున్నాయని అభ్యంతరాలు వ్యక్తమైతే, ఆయా సన్నివేశాలు తొలగించడానికి తాము సిద్ధం అని హామీ ఇచ్చారు.
శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగశౌర్య సరసన కాశ్మీరా, యామిని భాస్కర్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో హీరో నాగశౌర్య తండ్రి పాత్రలో శివాజీ రాజా కనిపించనున్నారు.