స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బయోపిక్ టీజర్‌ని రిలీజ్ చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రెండు వారాల క్రితమే టీజర్ షూటింగ్‌తోనే మొదటిసారిగా సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమాలో బాలయ్య బాబు ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్‌లో బాలయ్య బాబు మొత్తం 62 గెటప్స్‌లో కనిపించనున్నారు. సాధారణ నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఓ వ్యక్తి మహా నటుడు ఎలా అయ్యారు ? రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు ? రాజకీయాల్లోనూ గొప్ప రాజకీయ వేత్తగా ఎలా ఎదిగారు అనే అంశాలన్నీ ఈ సినిమాలో చూపించనున్నాడు డైరెక్టర్ తేజ. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలో బాలయ్య బాబు పాత్రను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. 


వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత రానున్న ఎన్నికలపై ఎన్టీఆర్ బయోపిక్ ప్రభావం చూపిస్తుందని పలువురు పరిశీలకులు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. దీనికితోడు సినిమాను ఎక్కడ ప్రారంభించాలో.. ఎక్కడ ముగించాలో తనకి తెలుసు అని బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు సైతం ఎన్టీఆర్ బయోపిక్‌లో డైరెక్టర్ ప్రస్తావించనున్న అంశాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.