`ఒక్క క్షణం` సినిమా రివ్యూ
అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్
నటీనటులు : అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు
డైలాగ్స్ : అబ్బూరి రవి
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ : నాగేంద్ర ప్రసాద్
బ్యానర్ : లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు : చక్రి చిగురు పాటి, ధీరేష్ చిగురుపాటి
కథ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : విఐ ఆనంద్
రిలీజ్ డేట్ : 28 డిసెంబర్ 2017
‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు శిరీష్ – ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’తో సూపర్ హిట్ అందుకున్న వీఐ ఆనంద్ కాంబినేషన్ లో ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘ఒక్క క్షణం’ ఈ రోజు విడుదలైంది. టీజర్, ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం.
కథ :
లైఫ్ ని కూల్ గా గడిపేసే కుర్రాడు జీవ (అల్లు శిరీష్). అనుకోకుండా ఓ షాపింగ్ మాల్ లో మొదటి చూపులోనే జ్యో(సురభి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అదే సమయంలో అనుకోకుండా జీవ జీవితంలోకి వస్తాడు శ్రీనివాస్(అవసరాల శ్రీనివాస్). ప్రేమించి పెళ్లిచేసుకున్న శ్రీనివాస్-స్వాతి (సీరత్ కపూర్)ల జీవితంలో జరిగిన సంఘటనలు తమ జీవితంలో కూడా జరగడాన్ని గమనిస్తారు జీవ-జ్యో. అలా ప్యారలల్ లైఫ్ గురించి తెలుసుకున్న జీవ ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు..? ఈ క్రమంలో డెస్టినీ గెలిచిందా..ప్రేమ గెలిచిందా.. అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు :
‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో ఆకట్టుకున్న అల్లు శిరీష్ ఈ సినిమాతో నటుడిగా మరింత డెవలప్ అయ్యాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. హీరోయిన్ సురభి, అందంతో యాక్టింగ్ తో ఆకట్టుకుంది. సీరత్ కపూర్ గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తూనే పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఇక స్టైలిష్ విలన్ గా దాసరి అరుణ్ పరవాలేదనిపించుకున్నాడు. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ కి అతికినట్టు సరిపోయాడు. సత్య-సుదర్శన్-వైవా హర్ష తమ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్వించారు.
టెక్నీషియన్స్ పనితీరు :
సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది మణిశర్మ గురించే. సాంగ్స్ తో ఓకే అనిపించినా… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్. నాగేంద్రప్రసాద్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఛోటా.కె.ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. కొన్ని సందర్భాల్లో అబ్బూరి రవి అందించిన ఎమోషనల్ డైలాగ్స్ పేలాయి. విఐ ఆనంద్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే టోటల్ సినిమాకే బ్యాక్ బోన్ గా నిలిచింది. లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
జీ సినిమాలు సమీక్ష :
గతంలో ‘టైగర్’, ఎక్కడికి పోతావు చిన్నవాడ’ సినిమాలతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకున్నాడు దర్శకుడు వీఐ ఆనంద్. ఇప్పుడు ఒక్క క్షణం మూవీతో ప్యారలల్ లైఫ్ అనే సరికొత్త కాన్సెప్ట్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.కొరియన్ మూవీ ‘ప్యారలల్ లైఫ్’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు.. ఫస్ట్ హాఫ్ లో కాస్త బోర్ కొట్టించినప్పటికీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఆడియన్స్ లో ఉత్సుకత రేకెత్తించాడు. అదే క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకూ తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా దర్శకుడిగా ఓ కొత్త కాన్సెప్ట్ ను ఎక్కడా తడబడకుండా అందరికీ అర్ధమయ్యేలా చెప్పి, కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగే అన్యాయాలను తెలియజేస్తూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.అల్లు శిరీష్, అవసరాల శ్రీనివాస్ పాత్రలు, సురభి-సీరత్ కపూర్ గ్లామర్, మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, స్టోరీ లైన్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్. బోర్ కొట్టించే ఫస్ట్ హాఫ్, చాలాచోట్ల కామెడీ పండకపోవడం, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకోలేకపోవడం, ఊహించగలిగే క్లైమాక్స్ సినిమాకు మైనస్.ఓవరాల్ గా ప్యారలల్ లైఫ్ అనే కొత్త కాన్సెప్ట్ తో ‘ఒక్క క్షణం’ సినిమా అందరినీ థ్రిల్ కు గురిచేస్తుంది.
రేటింగ్ : 3/5
(జీ సినిమాలు వెబ్‌సైట్ సౌజన్యంతో)