బెంగళూరు: ప్రముఖ చలనచిత్ర నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసి మాట్లాడారు. ఆయన తన కన్నా మంచి నటుడని సెటైర్ వేశారు. పాత్రికేయురాలు గౌరీ లంకేష్ మరణంపై మోదీ ఎలాంటి స్పందనను తెలియజేయక పోవడాన్ని ప్రకాశ్‌రాజ్ తప్పుబట్టారు. ప్రధాని ఇక మౌనంగా ఉంటే.. తన జాతీయ అవార్డులు తిరిగి ఇచ్చేయవలసి ఉంటుందని బెదిరించారు. సామాజిక మాధ్యమ వేదికల్లో చాలా మంది గౌరీ లంకేష్ హత్యను వేడుకలా జరుపుకుంటున్నారు.  వాళ్ల భావజాలం ఎలాంటిదో ప్రజలకు తెలుసు. వీరిలో కొందరు ప్రధాని నరేంద్ర మోదీ అనుచరుల్లా ప్రవర్తిస్తున్నారు. అదే నాకు తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.  డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్.. భారత ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన అనుచరుల వైఖరి పట్ల మోదీ మౌనంగా ఉండటం చూస్తే.. తనకంటే బాగా నటించగలరన్న విషయం తెలుస్తోంది అని అన్నారు. నేనో పేరు, ప్రఖ్యాతులు ఉన్న నటుడిని. మీరు నటిస్తున్నారో లేదో నాకు తెలియదా. మీరు నటిస్తున్నారా లేదా సత్యం మాట్లాడుతున్నారా అనేది నేను గుర్తించలేను అన్నది మీ అభిప్రాయమా అంటూ ప్రకాశ్‌రాజ్ ప్రశ్నలు సంధించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 5న ప్రముఖ కన్నడ వారపత్రిక  వ్యవస్థాపకురాలు గౌరీ లంకేష్‌ను కొందరు ఆగంతకులు ఆమె ఇంటి ముందే హత్య చేసిన విషయం విదితమే. గౌరీ లంకేష్‌ స్వయానా ప్రకాశ్‌రాజ్‌కు దూరపు బంధువు కావడం గమనార్హం.